Sep 05,2023 22:07

జీపు జాతా ప్రారంభంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న
ప్రజాశక్తి- నెల్లూరు:నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలని, జిల్లాలోని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా స్థాయి జీపుజాతా నెల్లూరులోని గాంధీబమ్మ సెంటర్‌లో మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన జి.రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్‌ జెండా ఊపి ఈ జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని గత ఎన్నికల ముందు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ఇచ్చిన హామీ అమలు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పాఠ్యపుస్తకాలు అందరికీ పంపిణీ చేయాలని, జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని, నగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, జిఒ నెంబర్‌ 107, 108 రద్దు చేసి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోనే ఉంచాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన సీతారాంపురం, ఉదయగిరి, మర్రిపాడు మండలాల్లో ప్రభుత్వరంగ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎపి జెన్‌కోను ప్రయివేటీకరణ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. దామరమడుగు, యల్లాయపాళెం, రాజుపాళెంలలో స్కూల్‌ హాస్టల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ బృందం సందర్శించింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోగల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లను ఈ బృందం సందర్శించనుంది. ఆరు రోజులపాటు జరిగే ఈ జాతా ఈ నెల పదిన నెల్లూరులో ముగియనుంది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు హర్ష, కార్యదర్శి శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, జిల్లా కార్యదర్శి రమణ, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.