- కృష్ణా జలాల పున:పంపిణీపై ఇచ్చిన గెజిట్‌ను ఉపసంహరించాలి : రౌండ్ టేబుల్ సమావేశంలో కె రామకృష్ణ, పి మధు
- కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాలను పున:పంపిణీ చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయడం సరైంది కాదని, తక్షణమే ఆ గెజిట్‌ను ఉపసంహరించాలని రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. అలాగే కృష్ణా నదీ పరివాహకంతో ఏమాత్రం సంబంధం లేని విశాఖపట్నంలో కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని పేర్కొంది. అలాగే రబీ సీజన్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతోపాటు ఖరీఫ్‌లో నీరందక ఎండిపోయిన పంటలన్నింటికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ సమస్యలపై ఈ నెల 14, 15 తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్షలు చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. బుధవారం విజయవాడలోని దాసరిభవన్‌లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం సీనియర్ నాయకులు పి మధు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు సుంకర పద్మశ్రీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, జనసేన నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో రాజకీయ లబ్ధిపొందేందుకు కృష్ణా జలాల పున:పంపిణీకి పూనుకుందని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేక పోతోందని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేలా ఉద్యమాలను ఉధృతం చేయాలని కోరారు.










