Mar 26,2023 12:43

ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పై బిజెపి అక్రమ కేసు బనాయించి దానిని చూపి పార్లమెంట్‌ నుంచి సస్పెన్షన్‌ చేయడం దుర్మార్గమని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిజెపి చర్యని నిరసిస్తూ ... ఆదివారం స్థానిక విజయనగరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఒకరోజు సత్యాగ్రహం చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు సరగడ రమేష్‌ కుమార్‌, కార్యదర్శి డోల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... రాహుల్‌ గాంధీ ఇదివరకు చేపట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ఆయనకు వచ్చిన దేశ ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి ప్రభుత్వం ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతుందన్నారు. పార్లమెంట్‌ సెషన్లో రాహుల్‌ గాంధీ అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాలు సరైన ఆధారాలు లేక ముచ్చెమటలు పట్టిన కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం... రాహుల్‌ను ఏ విధంగానైనా ఇబ్బందులకు గురిచేసి ఇరకాటంలో పెట్టాలని ఇలాటి దుశ్చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు ఆయన గాడ్సే వారసులు కాదు గాంధీ వారసులు అని... గాంధీ వారసులు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మరో స్వతంత్రానికై రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటం దిగ్విజయం జరుగుతున్నందుకు రేపు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్న బిజెపి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. మోడీ ఆదానికి ఉన్న సంబంధాల గురించి, అదాని అక్రమ ఆస్తుల పైన అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇలా దొడ్డి దారిని ఎంచుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీ అనేది ఇప్పుడు పుట్టుకొచ్చిన పార్టీ కాదు అని, ఇది ఒక జాతీయ పార్టీ అని, దీన్ని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని వారి పక్షాన ఈ పార్టీ పనిచేస్తుందని నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టణ కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.