- తడిచిన ధాన్యాన్ని 72 గంటల్లో కొనాలి : టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : 72 గంటల్లోగా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో 9న తహశీల్దార్ కార్యాలయాలు, 11న కలెక్టర్లకు వినతిపత్రాలు అందించి నిరసన తెలియజేస్తామని మాజీ సిఎం చంద్రబాబు అన్నారు. అప్పటికీ స్పందించకపోతే 13న రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. 'మా పంట మునిగింది- పరిహారం ఇవ్వండి' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని... రైతులందరూ తమ పంటను వీడియో తీసి పోస్టు చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రరంలోని వివిఆర్.కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తడిచిన ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఎలాంటి నిర్ధిష్టతలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాకు రూ.700 నుంచి రూ.800 మించి రావట్లేదని తెలిపారు. మిగిలిన సొమ్ము మిల్లర్లు తింటున్నారా? దళారులు తింటున్నారా? అనేది పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు జవహర్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, రూరల్ ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి తదితరులున్నారు.










