- ఒక్క రోజులోనే 5,137 మెగావాట్ల ఉత్పత్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ ఉత్పత్తిలో ఎపి పవర్ జనరేషన్ కార్పొరేషన్(జెన్‌కో) సరికొత్త రికార్డు సృష్టించింది. 105.620 మిలియన్ యూనిట్ల(5137 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తిని ఒక్కరోజులోనే నమోదు చేసింది. శుక్రవారం (ఈ నెల 12వ తేది) అర్ధరాత్రి 12 నుంచి శనివారం (13వ తేది) అర్ధరాత్రి 12 గంటల వరకు 114 మిలియన్ యూనిట్ల(ఎంయు) విద్యుత్ ఉత్పత్తి జరిగింది. జెన్‌కో వినియోగానికి పోనూ 105.620 ఎంయులను గ్రిడ్‌కు సరఫరా చేసింది. రాష్ట్రవిభజన తర్వాత ఒక్కరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషమని జెన్‌కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అన్ని విధాలుగా సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, విద్యుత్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, కేంద్ర రైల్వే, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు జెన్‌కో ఉద్యోగులను అభినందించారు. విజయవాడ థర్మల్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంలో నిర్మించిన కొత్త యూనిట్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దిగువ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తికోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు.
ఇహెచ్‌టి సబ్‌స్టేషన్‌లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు
ఎక్స్‌ట్రా హైటెన్షన్ (ఇహెచ్‌టి) సబ్‌స్టేషన్‌లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. దీనిపై జెన్‌కో ఎండి చక్రధర్‌బాబుతో కలిసి ఆదివారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ట్రాన్స్‌కో జెఎండి చక్రధర్ బాబు మాట్లాడుతూ 70 సబ్‌స్టేషన్‌లలో అమలు చేసేందుకు ఎపి ఇంధన పరిరక్షణ సమితితో ఎంవోయు కుదుర్చుకున్నట్లు తెలిపారు. విజయవాడ జోన్‌లోని గుంటూరు, ఒంగోలు, కృష్ణా, నెల్లూరులోని ఉన్న స్టేషన్లలో ఇప్పటికే ఇంధన సామర్ధ్య పరికరాలు అమర్చడం పూర్తయిందని తెలిపారు. ఈ చర్యలతో పాటు ప్రసార నష్టాలను 2.8 శాతం కంటే తగ్గించేందుకు ట్రాన్స్‌కో చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో జెఎండి (విజిలెన్స్) బి మల్లారెడ్డి, డైరెక్టర్లు ఎవికె భాస్కర్, టీ వీరభద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










