Aug 20,2023 09:13
  • గతేడాది కంటే 2,886.791 ఎంయులు అధికం
  • సిబ్బందికి ఎమ్‌డి చక్రధర్‌బాబు అభినందనలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ విద్యుదుత్పాదక సంస్థ (ఎపిజెన్‌కో) విద్యుదుత్పత్తిలో రికార్డులు సృష్టించిందని జెన్‌కో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో థర్మల్‌ యూనిట్లు అద్భుత పనితీరు ప్రదర్శించాయని శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి వరకూ థర్మల్‌ విద్యుత్‌ 10,108.196 మిలియన్‌ యూనిట్ల (ఎంయు) ఉత్పత్తి జరిగిందని తెలిపింది. ఈ ఏడాది ఇదే కాలంలో 12,994.987 ఎంయుల ఉత్పిత్తి జరిగిందని పేర్కొంది. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది నాలుగున్నర నెలల కాలంలో 2,886.791 ఎంయుల ఉత్పత్తి అధికంగా జరిగిందని వివరించింది. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు అవసరమైన 45 నుంచి 50 శాతం విద్యుత్‌ను జెన్‌కో అందిస్తోందని పేర్కొంది. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పిఎల్‌ఎఫ్‌) కూడా పెరిగిందని తెలిపింది. జెన్‌కో అనుబంధ సంస్థ ఎపిపిడిసిఎల్‌ ప్లాంట్లు గతేడాది ఆగస్టు 18 వరకు 51.48 శాతం పిఎల్‌ఎఫ్‌ సాధించాయని, ఈ సంవత్సరం ఇదే కాలంలో 66.61 శాతానికి పెరిగినట్లు వివరించింది. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఆర్‌టిపిపి) 64.10 నుంచి 72.43 శాతానికి, నార్ల తాతారావు, థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్‌టిటిపిఎస్‌) 73.59 నుంచి 78.38 శాతానికి చేరిందని పేర్కొంది. థర్మల్‌ యూనిట్లలో విద్యుదుత్పత్తి పెంచడానికి సిబ్బంది, అధికారులు కృషి చేస్తున్నారని జెన్‌కో ఎమ్‌డి కెవిఎన్‌ చక్రధర్‌బాబు ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ, సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటూ మరింత అంకిత భావంతో పనిచేస్తూ జెన్‌కోను అన్ని విధాలా దేశంలోనే అగ్రగామిగా నిలపాలని సూచించారు. రాష్ట్రానికి ఎక్కువ పరిమాణంలో బొగ్గు కేటాయించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి ఒప్పించారని తెలిపారు. అందువల్లే అంతరాయం లేకుండా ఉత్పత్తి చేయగలిగామని పేర్కొన్నారు.