Aug 18,2023 10:15
  • సిపిఎంకు మద్దతుగా కాంగ్రెస్‌ నిర్ణయం

అగర్తల : త్రిపురలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని తిప్రా మొత, కాంగ్రెస్‌ ప్రకటించాయి. తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలోని ధన్‌పూర్‌, బోక్సానగర్‌ అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరు 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రెండు స్థానాలకు సిపిఎం తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. బిజెపి వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ నిర్ణయించినట్లు త్రిపుర పిసిసి అధ్యక్షులు ఆశీష్‌ కుమార్‌ సాహా గురువారం తెలిపారు. 'ఇండియా' కూటమిలోని సిపిఎం పోటీ చేస్తుండటంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిపిసిసి, ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అదే అభిప్రాయాన్ని తిప్రా మొత నాయకులు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అనిమేష్‌ దెబ్బర్మ కూడా వెల్లడించారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై చర్చ జరుగుతుందని, ఈ నెల 19లోగా వైఖరి ప్రకటిస్తామని తెలిపారు.