Aug 05,2023 13:26

అగర్తల : గతేడాది కర్ణాటకలో జరిగిన హిజాబ్‌ వివాదం మరువకముందే.. మరోసారి దేశంలో ఇలాంటి వివాదాలే రాజుకుంటున్నాయి. తాజాగా త్రిపురలో హిజాబ్‌ వివాదం తలెత్తింది. ఓ ముస్లిం విద్యార్థినీ హిజాబ్‌ ధరించి పాఠశాలకు వచ్చినందుకు విహెచ్‌పి కార్యకర్తలు రెచ్చిపోయి.. ఘర్షణలకు పాల్పడ్డారు. ఆ బాలికకు ఓ ముస్లిం బాలుడు అండగా నిలిచినందుకు విశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) కార్యకర్తలు చితకబాదారు. ఈ ఘటన శుక్రవారం త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా జిల్లాలో కరైమురా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరైమురా ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రియతోష్‌ నంది విద్యార్థినీలకు హిజాబ్‌ ధరించి పాఠశాలకు రావద్దని గతవారం సూచించారు. అయినప్పటికీ 12వ తరగతే చదివే ఓ ముస్లిం విద్యార్థినీ హిజాబ్‌ ధరించి స్కూలుకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ స్కూల్  గేటు బయటే ఆ విద్యార్థినీని విశ్వహిందూ పరిషత్‌ కార్యర్తలు నిలువరించారు. ఆ బాలికకు పదో తరగతి చదివే ఓ ముస్లిం బాలుడు అండగా నిలబడ్డాడు. దీంతో విహెచ్‌పి కార్యకర్తలు ఆగ్రహం చెంది ఆ ముస్లిం బాలుడిని దారుణంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చితకబాదారు. ఈ ఘటన జరుగుతుంటే.. ఆ స్కూల్‌లోని ప్రధానోపాధ్యాయుడితో సహా ఏ ఉపాధ్యాయుడు ఆ బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించలేదు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సమీపంలోని రోడ్లను దిగ్బంధించారు. సెపాహిజాలా జిల్లాలోని బిషల్‌ఘర్‌ సబ్‌ డివిజన్‌లో ఉద్రిక్తపరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. విహెచ్‌పి కార్యర్తల్ని, స్థానికుల్ని చెదరొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా, ఈ ఘటన జరగకముందే గత వారం రోజుల క్రితం విహెచ్‌పి కార్యకర్తలు.. పాఠశాల ప్రధానోప్యాయుడిని కలిసి.. పాఠశాలలో హిజాబ్‌ని నిషేధించాలని కోరారు. దీంతో ఆ స్కూల్‌ హెడ్‌మాష్టర్‌ ప్రియతోష్‌ హిజాబ్‌ ధరించి స్కూల్‌కి రావాలని ప్రభుత్వ శాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు లేవు కనుక హిజాబ్‌ ధరించి రావద్దని విద్యార్థినీలకు ఆయన సూచించినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. హిందూ ముస్లింలు కలిసి ఉన్న ప్రాంతం కానుక.. ఘర్షణలు జరగకుండా ముందస్తుగా పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని భారీగా మోహరించాయి. అలాగే ఘర్షణలు తలెత్తకుండా.. ముందస్తుగా విద్యాబోధనల్ని నిలిపివేశారు. రాష్ట్ర అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సమస్యను పరిష్కరించడానికి ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.