Sep 09,2023 07:34
  •  త్రిపుర ఉప ఎన్నికలను రద్దు చేయాలి : సిపిఐ(ఎం)

అగర్తలా : త్రిపురలో ఉప ఎన్నికలు జరిగిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలైన బాక్సానగర్‌, ధన్‌పూర్‌ల ఫలితాలను చూసినట్లైతే లెఫ్ట్‌ ఫ్రంట్‌ వ్యక్తం చేసిన భయాందోళనలు నిజమేనని రుజువైందని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, పకడ్బందీ పర్యవేక్షణలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న తమ డిమాండ్‌ కూడా సమర్ధనీయమేనని పేర్కొంది. బాక్సానగర్‌ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో బిజెపికి 89శాతం లభించాయి. ధన్‌పూర్‌ నియోజకవర్గంలో 71శాతం లభించాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే ఇది కనివినీ ఎరుగనిదని పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో పేర్కొంది. బాక్సానగర్‌ సీటును ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సిపిఎం గెలిచిన తర్వాత, పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగితే తప్ప 89శాతం ఓట్లు సాధించడం బిజెపికి అసాధ్యమని పేర్కొంది. పాలనాయంత్రాంగం, పోలీసులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ చేయడంతో ఈ ఎన్నికలు ఒక ప్రహసనంగా మారాయని విమర్శించింది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు సీట్ల ఎన్నికలను రద్దు చేసి, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య తిరిగి ఎన్నికలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.