ప్రజాశక్తి-జగ్గయ్యపేట (ఎన్‌టిఆర్ జిల్లా) : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు మూడు రోజులు సెలవులు రావడంతోపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పట్టణం వాసులు పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రాకు వచ్చే ప్రయాణికుల వాహనాలతో ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోని జిఎంఆర్ టోల్‌గేట్, కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి కావడంతో హైదరాబాద్ పట్టణంలో నివసించే వారు తమ స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతంగా రద్దీ పెరిగింది. కార్లు, ఇతర వాహనాలతో కిటకిటలాడుతోంది. చిల్లకల్లు టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.










