Sep 11,2023 11:03

ప్రజాశక్తి-కదిరి టౌన్‌ : టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ... టిడిపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు బందుకు పిలుపునివ్వడంతో పార్టీ పిలుపుమేరకు చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ సోమవారం ఉదయం 6 గంటలకు కదిరి పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకొని రాకపోకలను అడ్డుకున్నారు. కందికుంట బందు చేస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో కందికుంట పోలీసులనువారిస్తూ టిడిపి జాతీయ అధ్యక్షులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారనీ, అరెస్టుకు నిరసనగా ముఖ్యమంత్రి కక్షసాధింపులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్నామని నేతలు స్పష్టం చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ చేరుకొని ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడుతూ ... రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఆక్రమంగా అరెస్టు చేశారని ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ ఉద్యోగులుగా గుర్తించారా అని, అలవెన్సులన్నీ అందుతున్నాయా అని ఉద్యోగులను ప్రశ్నించారు. దీంతో వారు సమాధానం చెప్పలేకపోయారు. హక్కుల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని ప్రయాణికులను ఆర్టీసీ డిఎం కు విజ్ఞప్తి చేశారు . అనంతరం పోలీసులు కందికుంటను బలవంతంగా పోలీస్‌ వాహనం ఎక్కించి గాండ్ల పెంట పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.