ప్రజాశక్తి-కదిరి అర్బన్(సత్యసాయి జిల్లా) : టిడిపి, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో కదిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన ఈ ఘర్షణలో టిడిపి శ్రేణులను అర్బన్ సీఐ తమ్మిశెట్టి మధు లాఠీచార్జ్ చేయించడమే కాకుండా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐ మధు ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. మధు దుశ్చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను చితకభాదడంతో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జి బికె.పార్థసారథి తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించిన నేపథ్యంలో విలేకరుల సమావేశములో పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలను సీఐ మధు కొట్టారని, మహిళా కౌన్సిలర్ ను నానా మాటలతో దుర్భాషాలాడారని తెలిపారు. సీఐ మధు భేషారుతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలనీ, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని పార్థసారథి డిమాండ్ చేశారు. గాయపడిన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ దాడిలో పాల్గొన్న వైస్సార్ పార్టీ నాయకుల మీద హత్యయత్నం కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, కదిరి నియోజకవర్గం ఇంచార్జి కందికుంట ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి నెట్టం వెంకటేష్, జిల్లా కార్యదర్శి రొద్దం నరసింహులు, మనోహర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.










