- మళ్లీ వేలం పాటల విధానం
- అధికార పార్టీ నేతల నుంచే డిమాండ్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ప్రస్తుతమున్న ప్రభుత్వ మద్యం దుకాణాల విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో మాదిరిగానే వేలం పాటల ద్వారా దుకాణాలను ఖరారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అధికారపార్టీ నేతల నుంచే దీనికోసం ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తరగా 2,934 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి కాలపరిమితి వచ్చే నెల 30వ తేదీతో ముగియనుంది. ఇక అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త ఏడాది నుంచి ఉన్న పాలసీనే కొనసాగిస్తారా, లేక మళ్లీ వేలం పాటల ద్వారా ప్రయివేటు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాత విధానంలోకి వెళ్తే బాగుంటుందని అధికార పార్టీకి చెందిన వారే డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపక్షాలకు చెందిన వారు కూడా ఇదే కోరిక వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేలం పాటల ద్వారా దుకాణాలు నిర్వహించే సమయంలో ఎక్కువ దుకాణాలను రాజకీయ నేపథ్యం ఉన్న వారే దక్కించుకున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తుండటంతో వీరికి ఆర్థిక వనరులు తగ్గాయి. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ వేలం పాటల ద్వారా దుకాణాల నిర్వహణ అంశం తెరపైకి వస్తోంది. అలా అయితేనే కొంతమేరకైన ఎన్నికల వ్యయాన్ని తట్టుకోవడం సాధ్యమవుతుందని వీరు అంటున్నారు. అధికారపార్టీకి చెందిన కొందరు ప్రభుత్వంలో పెద్దలను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఇదే విషయాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయమే కీలకం కావడంతో ఆయన్ను ఎలాగైనా ఒప్పించడానికి ఈ లాబీ ప్రయత్నిస్తోందని తెలిసింది. కొరతమంది ప్రభుత్వంలోనివారు కూడా ఈ డిమాండ్‌పై సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నేతల ఆదాయం సంగతి ఎలా ఉన్నా, సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులు ఒకేసారి సమకూరుతాయని అంటున్నారు. విధాన మార్పు చేయాల్సి వస్తే దీనిని శాసనసభలో పెట్టాల్సి ఉంటుందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. సిఎం సానుకూలంగా స్పందిస్తే వచ్చే నెలలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లో మద్యం పాలసీ మార్పు బిల్లును కూడా పెట్టే అవకాశం ఉంది.










