Jul 02,2022 06:59

లండన్‌ : మద్యం మత్తులో జరిగిన సంఘటనతో డిప్యూటీ చీఫ్‌విఫ్‌ తన పదవికి రాజీనామా చేయడం, అతన్ని కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు శుక్రవారం హెచ్చరికల కలకలం.. నేపథ్యంలో బ్రిటన్‌ ప్రభుత్వం మరో కుంభకోణంలో చిక్కుకుంది. డిప్యూటీ చీఫ్‌విఫ్‌ క్రిస్‌ పించర్‌ గురువారం ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించారు. 'బుధవారం రాత్రి నేను చాలా ఎక్కువగా తాగాను, నన్ను, ఇతర వ్యక్తులను ఇబ్బంది పెట్టాను. ఇందుకు సంబంధించిన వ్యక్తులకు క్షమాపణలు చెబుతున్నాను' అని లేఖలో తెలిపారు. అయితే కన్జర్వేటివ్‌ పార్టీలోనే కొనసాగుతానని, ప్రధానమంత్రికి మద్దతుగా ఉంటానని చెప్పారు. పించర్‌ రాజీనామా బోరిస్‌కు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ మద్యంతో వేడుకలు చేసుకున్నందుకు బోరిస్‌ ప్రభుత్వం గత నెలలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంది. అలాగే కన్జర్వేటివ్‌ సభ్యుడు ఒకరు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తు దొరికిపోయారు. ఇప్పుడు తాజాగా డిప్యూటీ చీఫ్‌విఫ్‌ రాజీనామా చేయడం బోరిస్‌కు తలనొప్పిగా మారింది. మరోవైపు రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ చైర్మన్‌ ఆలివర్‌ డౌడెన్‌ తన పదవీకి రాజీనామా చేశారు. బోరిస్‌ కూడా తన పదవీకి రాజీనామా చేయాలనే డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి.