అమరావతి: గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మార్పులు చేసింది. బిల్లులో లోపాలను సవరిస్తూ మరోమారు కేబినెట్ ఆమోదానికి పంపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ఇ-ఫైల్ ద్వారా బిల్లును మంత్రులకు సర్క్యులేట్ చేసింది. జీపీఎస్‌లో ప్రతిపాదించిన పెన్షన్ టాప్ అప్‌పై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ప్రతిపాదనలు చేసింది. ఫ్యామిలీ పెన్షన్, మినిమమ్ పెన్షన్ ఎలా ఇవ్వాలన్న దానిపై బిల్లులో మార్పులు చేర్పులు చేసింది. జీపీఎస్ బిల్లులో తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు ఆమోదించి పంపాలని మంత్రులకు ప్రభుత్వం సూచించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు జీపీఎస్‌లోనే కొనసాగేలా నిర్దేశిత గడువు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.










