Sep 24,2022 20:30

- 887 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) :రాజధాని ప్రాంతమైన అమరావతిలోని విఐటి (విట్‌) విశ్వవిద్యాలయ రెండవ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రక్షణ రంగ నిపుణులు డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి, కార్పొరేట్‌ కంపెనీ బైజూస్‌ హెచ్‌ఆర్‌ సుమన్‌ రుద్రా, కాగజెంట్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కృష్ణ పాకాల హాజరయ్యారు. స్నాతకోత్సవంలో క్లాస్‌ అఫ్‌ 2022కు చెందిన 887 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రక్షణ రంగ నిపుణులు సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యల గురించి వివరించారు. భారతదేశాన్ని సాంకేతికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి భవిష్యత్‌ సాంకేతికతలలో పని చేయాలని విద్యార్థులను కోరారు. సుమన్‌ రుద్రా మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. కృష్ణ పాకాల మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలన్నారు. విఐటి ఫౌండర్‌ అండ్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ మాట్లాడుతూ అవుట్‌ లుక్‌ ఐకేర్‌ ర్యాంకింగ్స్‌ - 2022లో ఎమర్జింగ్‌ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ కేటగిరిలో విఐటి-ఎపి విశ్వవిద్యాలయం భారతదేశంలోనే మొదటి ర్యాంక్‌ సాధించటం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విఐటి వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌, వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఎస్‌.వి.కోటా రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ జగదీష్‌ చంద్ర పాల్గొన్నారు.