Oct 27,2023 07:58

విశాఖ: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దయ్యాయి. డివిజన్‌ పరిధిలోని భద్రతా పనుల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో ప్యాసింజర్‌ సహా, ఉదయ్ డబుల్‌ డెక్కర్‌ రైలు ఉన్నాయి. అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో రాజమండ్రి - విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్‌ రైలును (07466) పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో తిరుగు ప్రయాణం అయ్యే రైలు (07467) కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.విశాఖపట్నం - విజయవాడ మధ్య ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడిచే డబుల్‌ డెక్కర్‌ (22701) రైలును 27, 28 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. తిరుగు ప్రయాణమయ్యే రైలు కూడా అయా తేదీల్లో అందుబాటులో ఉండదని పేర్కొన్నాయి. వీటితో పాటు 26, 27, 28 తేదీల్లో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం- కిరండూల్‌ (18514) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరాపుట్‌ నుంచి తిరిగి ప్రయాణం అవుతుంది. అలాగే హౌరా - జగ్దల్‌పూర్‌ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ టిట్లాగఢ్‌ నుంచి హౌరాకు తిరిగి ప్రయాణం అవుతుంది. భువనేశ్వర్‌-జగ్దల్‌పూర్‌ హిరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ (18447) కొరాపుట్‌ నుంచి తిరిగి ప్రయాణం అయ్యి భువనేశ్వర్‌ చేరుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి.