Jul 15,2023 09:29
  • సొంతపార్టీపై నిప్పులు చెరిగిన మిజోరం బిజెపి నేత
  • పార్టీకి ఉపాధ్యక్షుడు వన్రమ్చువంగ రాజీనామా
  • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపైనా విమర్శలు

ఐజ్వాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ చెలరేగడానికి, గిరిజన తెగల మధ్య విద్వేషాలకు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలే కారణమని కాషాయ పార్టీకే చెందిన సీనియర్‌ నేత వన్రమ్చువంగ నిప్పులు చెరిగారు. రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న తెగల ఘర్షణలకు 'డబుల్‌ ఇంజిన్‌' బిజెపి ఉండాలని మోడీ ఈ డబుల్‌ ప్రధానకారణమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో బిజెపియే అధికారంలో ఉంటే ప్రగతి పరుగులు దీస్తుందని పేర్కొంటూ 'డబుల్‌ ఇంజిన్‌' నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ఎన్నికలు జరిగినా పదేపదే ప్రస్తావిస్తారన్న సంగతి తెలిసిందే.
            ఇప్పుడు ఆ డబుల్‌ ఇంజిన్‌ పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి కారణమవుతోందన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇప్పుడు సొంత నేతలే బిజెపి తీరును ఎండగట్టి రాజీనామాలు చేస్తుండటం గమనార్హఒం. ఈ క్రమంలో మిజోరం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌. వన్రమ్చువంగ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో మణిపూర్‌, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయన ఆరోపణలు సంధించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్‌లో చర్చిలకు నిప్పంటిస్తూ విధ్వంసానికి పాల్పడుతున్న మెయితీ చర్యలకు మద్దతిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయితీల ద్వారా మొత్తం 357 చర్చిలు, పాస్టర్ల క్వార్టర్లు, వివిధ చర్చిల కార్యాలయ భవనాలు కాలి బూడిదయ్యాయని ఆయన ఆరోపించారు. క్రిస్టియన్లు, క్రిస్టియన్‌ మతానికి జరుగుతున్న నేరపూరిత అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మిజోరం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను'' అని మిజోరం బిజెపి అధ్యక్షుడికి రాసిన లేఖలో వన్రమ్చువంగ పేర్కొన్నారు.
          మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌ సింగ్‌ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కానీ చర్చిలను తగలబెట్టే ఘటనలను ఖండిస్తూ ఒక్క మాటా మాట్లాడలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి కూడా ఇదే తీరు ఉన్నదని వివరించారు. కాబట్టి మణిపూర్‌లో పెద్ద ఎత్తున చర్చిలను ధ్వంసం చేసే ఘటనల వెనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ఉన్నదని తాను విశ్వసిస్టున్నట్టు పేర్కొన్నారు. బిజెపి క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ అని వచ్చే ఆరోపణలకు ఇవి బలాన్ని చేకూర్చాయని ఆరోపించారు. ''దుండగుల దుశ్చర్యలపై రాష్ట్ర నాయకులు, సెంట్రల్‌ లీడర్లు ఖండనను తెలియజేయాల్సింది. బాధితుల రక్షణ, ఓదార్పుకోసం ఏదో ఒకటి చేయాల్సింది. మిజోరంలో అత్యధికం క్రిస్టియన్లే. బిజెపి.. క్రిస్టియన్ల వ్యతిరేక పార్టీ అని మణిపూర్‌లో వెల్లడైంది. బిజెపి నిజంగానే క్రిస్టియన్ల వ్యతిరేఖ పార్టీ అని ప్రజలు చెప్పగలరు. ఒక చర్చి నాయకుడిగా నేను బిజెపితో ఉండకూడదు'' అని వన్రమ్చువంగ వివరించారు. ఈ ఏడాది మే 3న మణిపూర్‌లో మెయితిలు, కుకీల మధ్య ఎస్టీ హౌదా కల్పించే విషయంలో వివాదం చెలరేగి తీవ్ర హింసకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇది మత ఘర్షణలకు కారణమై వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసింది.