Sep 19,2020 21:09

ప్రభుత్వం తన వద్ద అందుబాటులో ఉంచుతామన్న యూరియా బఫర్‌ స్టాక్స్‌ కోటాను కుదించింది. గతం కంటే 30 వేల టన్నులను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు యూరియా బఫర్‌ స్టాక్స్‌ను తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ, సహకార శాఖ వెలువరించిన జీవోలో పేర్కొంది. యూరియా కొరత నెలకొన్న తరుణంలో సర్కారు బఫర్‌ స్టాక్స్‌కు కోత పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఖరీఫ్‌, రబీ పంట కాలంలో డిమాండ్‌ పెరిగి అదనుకు రైతులకు మార్కెట్‌లో ఎరువులు లభించని పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కొన్నేళ్లుగా ఎపి మార్క్‌ఫెడ్‌ ముందస్తుగా ఎరువులను అదనంగా సేకరించి పెట్టుకుంటోంది. అవసరమైన సందర్భాల్లో బఫర్‌ స్టాక్స్‌ను బయటికితీసి రైతులకు సరఫరా చేస్తోంది. సమయం చూసుకొని ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడకుండా చెక్‌ పెట్టే ప్రధాన ఉద్దేశంతో మార్క్‌ఫెడ్‌ను ఎరువుల సరఫరా నిమిత్తం నోడల్‌ ఏజెన్సీగా నియమిస్తోంది. 2020-21లో 1.5 లక్షల టన్నుల యూరియా బఫర్‌ స్టాక్స్‌ను సేకరించి పెట్టుకోవాలని ఈ ఏడాది మార్చి 16న జీవోఆర్‌టి నెం.276ను జారీ చేసింది. బఫర్‌ స్టాక్స్‌ను తగ్గిస్తూ ఆ జీవోను ఇప్పుడు సవరించింది. కాగా ఈ సంవత్సరం కరోనా వలన యూరియా, ఇతర ఎరువుల ఉత్పత్తి, రవాణా, ముడి సరుకుల దిగుమతులు ఇత్యాది విషయాల్లో ఇబ్బందులచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, ఎరువుల కంపెనీల రైతు వ్యతిరేక తీరుతో యూరియా కొరత నెలకొంది. ఈ సమయంలోనే, రాష్ట్రానికి కేంద్రం కేటాయించే ఎరువుల సరఫరా విషయంలో ఎపి ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాలు రైతులకు యూరియా కష్టాలు మరింతగా పెంచాయి. సమస్య కొనసాగుతుండగానే, మార్క్‌ఫెడ్‌ వద్ద యూరియా బఫర్‌ స్టాక్స్‌ను 1.5 లక్షల టన్నుల నుంచి 1.2 లక్షల టన్నులకు తగ్గించడం, అందుకు ఆర్థిక భారాన్ని కారణంగా చూపడంపై విమర్శలస్తున్నాయి. ప్రభుత్వ చర్య ప్రైవేటు డీలర్లకు లాభిస్తుందని, బ్లాక్‌మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది యూరియాతో పాటు డిఎపి 10 వేల టన్నులు, కాంప్లెక్స్‌ 20 వేల టన్నుల చొప్పున మార్క్‌ఫెడ్‌ బఫర్‌ స్టాక్స్‌ను నిర్వహించాలని వ్యవసాయశాఖ ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు.