- ప్రైవేటు డీలర్లకు బలవంతంగా స్టాక్స్
- కర్షకులకు అంటగడుతున్న వ్యాపారులు
- చాలా చోట్ల పేరుకుపోయిన నిల్వలు
- ఆర్‌బికెల్లోనూ అమ్మకాలు
- కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన ఎపి సర్కార్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : శాస్త్రీయంగా నిరూపణ కాని నానో యూరియాను కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచి మన రాష్ట్ర రైతాంగంపై బలవంతంగా రద్దుతోంది. ప్రైవేటు డీలర్లకు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)కు అంటకడుతోంది. కేంద్రం ఒత్తిడి మేరకు ఎపి సర్కారు కింది స్థాయి అధికారులకు ఆర్‌బికెల నుంచి నానో యూరియా కోసం ఇండెంట్లు పెట్టాలని, రైతులకు వాటిని అమ్మాలని సూచిస్తోంది. రైతుల్లో అంతగా ఆసక్తి లేకపోవడం, సాధారణ యూరియాకు మల్లే పని చేసే విషయంలో సరైన నిర్ధారణలు లేనందువలన కింది స్థాయి సిబ్బంది ఇండెంట్లు పంపట్లేదు. ప్రైవేటు డీలర్ల వద్ద నానో యూరియా స్టాక్ అమ్ముడు పోక అలాగే పడి ఉంటోంది.
లారీకి పది కేసులు
సాధారణ యూరియాకు ప్రత్యామ్నాయం పేరిట మోడీ ప్రభుత్వం ఇఫ్కో నుంచి నానో యూరియాను విడుదల చేసింది. ఇఫ్కో ఉత్పత్తి చేసిన నానో యూరియాను రాష్ట్రాలకు కేటాయిస్తోంది. మన రాష్ట్రానికి కేటాయించే సాధారణ యూరియాలో 50 శాతం ఆర్‌బికెలకు, 50 శాతం ప్రైవేటు డీలర్లకు కేటాయిస్తున్నారు. ప్రైవేటు డీలర్లకు పంపించే సాధారణ యూరియాకు, నానో యూరియాను ముడిపెట్టి బలవంతంగా అంటగడుతున్నారు. ఒక లారీ సాధారణ యూరియాకు పది కేసులు అంతకంటే ఎక్కువ నానో యూరియా సీసాలు వేసి పంపుతున్నారు. ఒక లారీలో పది టన్నుల సాధారణ యూరియా రవాణా అవుతుంది. వాటిపై పది కేసుల నానో యూరియా కలిపి పంపుతున్నారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉంటుంది. ఒక్కో బాటిల్‌లో 500 మిల్లీలీటర్లు ఉంటుంది. అటువంటి బాటిల్స్ ఒక్కో కేసులో 40 ఉంటాయి. నలభై ఎకరాలకు ఒక కేసు సరిపోతుంది. పది కేసులు డీలర్లకు అంటగట్టడంతో చేసేది లేక కుదిరిన చోట రైతులకు డీలర్లు వేరే ఎరువుతో లింక్ పెట్టి అంటగడుతున్నారు. ఒక్కో చోట రైతులు తీసుకోకపోవడంతో సగానికి సగం ధర తగ్గిస్తున్నారు. ఒక్కో బాటిల్‌కు ఎంఆర్‌పి రూ.245గా నిర్ణయించగా అందులో సగానికి ఇస్తున్నారు. అయినప్పటికీ రైతులు నిరాకరించడంతో పక్కన పడేస్తున్నారు. తమ వద్ద నానో యూరియా స్టాక్ పక్కన పడేశామని ఒక డీలర్ తెలిపారు. సాధారణ యూరియా 45 కిలోల బస్తా ధర రూ.266.50 కాగా అంతకంటే తక్కువకు నానో యూరియా వస్తున్నా శాస్త్రీయత నిర్ధారణ కాకపోవడంతో రైతులు ఆసక్తి చూపట్లేదని చెప్పారు. త్వరలో నానో డిఎపి సైతం మార్కెట్‌లోకి వస్తుందంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండెంట్ల కోసం ఫోర్స్
గతేడాది నుంచీ ఆర్‌బికెలపై వ్యవసాయశాఖ పై అధికారుల నుంచి నానో యూరియా తీసుకోవాలన్న ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. కేంద్రం బలవంతంతో వ్యవసాయశాఖ హెడ్‌క్వార్టర్స్ నుంచి కింది స్థాయి అధికారులకు నానో అమ్మాలని తరచు ఆదేశాలు వెళుతున్నాయి. ప్రైవేటు డీలర్లకు మల్లే లింక్ లేకపోయినా నానో యూరియా కోసం ఆర్‌బికెల నుంచి ఇండెంట్లు కోరుతున్నారు. ఆర్‌బికెలకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్‌ఫెడ్ వద్ద నానో యూరియా నిల్వలున్నాయని, వాటిని వదిలించుకునేందుకు ఆర్‌బికెలపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. వర్షాభావంతో ఈ ఏడాది అసలు పంటలే సాగుకాని పరిస్థితుల్లో ఎరువులకు డిమాండ్ తగ్గగా, నానో యూరియా అమ్మాలనడంపై క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. నత్రజని అధికంగా కావాల్సిన వరి, మిరప, పత్తి తదితర పంటలకు నానో యూరియా సూట్ కాదని, నత్రజని తక్కువ అవసరమయ్యే కూరగాయల వంటి కొన్ని పంటలకు నానో కొద్ది మేర సరిపోవచ్చని వ్యవసాయాధికారులు అభిప్రాయపడుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర ప్రభుత్వ రిసెర్చ్‌్ సెంటర్లలో నానో యూరియా వినియోగించట్లేదు. కేవలం ప్రైవేటు ఎరువుల వ్యాపారుల ద్వారా రైతులకు అంటగడుతున్నారు. అక్కడక్కడ ఆర్‌బికెలకు పంపుతున్నారు.










