Jan 02,2023 20:13
  • అడ్డుకోవాలని ఎపి రైతు, కౌలు రైతు, వ్యకాస ధర్నా

ప్రజాశక్తి-నెల్లూరు : బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా అమ్మకాలను అడ్డుకోవాలని, రైతాంగానికి సరిపడా యూరియాను ఆర్‌బికెల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఎపి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు, చంద్రమౌళి మాట్లాడారు. జిల్లాలో ఆరు నుంచి ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందన్నారు. ఆర్‌బికెల ద్వారా సరిపడా యూరియాను రైతులకు అందించకపోవడంతో బ్లాక్‌ మార్కెటులో ఒక్కొక్క బస్తా (రూ.267) కు రూ.70 అధికంగా చెల్లిస్తున్నారని తెలిపారు. ఇ-క్రాప్‌ నమోదుతో సంబంధం లేకుండా కౌలురైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. పుల్లయ్య మాట్లాడుతూ.. తక్షణమే ఆర్‌బికె కేంద్రాల్లో, సొసైటీల్లో యూరియా అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్‌, పలువురు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.