తిరుపతి బ్యూరో : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వల్ల విశాఖ ఉక్కుకే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానానికీ ప్రమాదమేనని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఓ ప్రకటనలో విమర్శించారు. ఈనెల 7న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధ్యక్షతన జరిగిన రహస్య సమావేశంలో బిజెపి నాయకులు 30 మంది పాల్గన్నారని తెలిపారు. ముఖ్యంగా ట్రస్టుగా ఉండే టిటిడిని ఎలా తమ చేతుల్లోకి తీసుకోవాలా? అని లీగల్ సలహా తీసుకున్నారని పేర్కొన్నారు. హిందూ ధర్మ ఆచార్య సభ చేతుల్లోకో, మఠాల చేతుల్లోకో తీసుకోవాలని ప్రతిపాదించారని తెలిపారు. ఇదేగనుక జరిగితే పదివేల మంది శాశ్వత ఉద్యోగులు, పదివేల మంది తాత్కాలిక ఉద్యోగులు, వేలాదిమంది టిటిడి పింఛన్‌దారులపై ఈ ప్రభావం పడుతుందన్నారు. పదివేల కోట్ల డిపాజిట్లు, వందల కోట్ల బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న టిటిడిని ధారాదత్తం చేసుకునే దిశగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి డబ్బులు దండుకోవడమే పనిగా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి బలహీనత వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మివేయడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలో సంక్షోభం మొదలయ్యిందని, టిటిడి కూడా చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.










