- కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : గాజాపై దారుణానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమర్థించడం భారతదేశానికి అవమానకరమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విశాఖలోని విజెఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ గాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ చేసిన బాంబుల దాడిలో 500 మంది రోగులు, మరో 500 మంది ఆస్పత్రి సిబ్బంది మరణించారని, వారిలో చిన్నపిల్లలు, మహిళలు అధికంగా ఉన్నారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ చంకలో మోడీ ఉన్నందునే ఆయన చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జిఎస్‌టి విధానాన్ని తీసుకురావడం వల్ల మూడు వేలకు పైగా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. నెలకు రూ.లక్షన్నర కోట్లు జిఎస్‌టి ద్వారా కేంద్రం వసూలు చేస్తోందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందని, ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యమే లేదని విమర్శించారు.










