Aug 05,2020 18:24



స్కీం వర్కర్ల దేశవ్యాపిత సమ్మెలో ఆశాలు
స్కీం వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలన్న డిమాండ్‌
కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలి

కరోనా కాలంలో ప్రాథమిక వైద్య సేవలందించడంలో వీరిది కీలక పాత్ర. వీరు జిల్లాలో 1300 మంది ఉన్నారు. ఇంటింటికి తిరిగి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వివరిస్తున్నారు. దగ్గినా.. తుమ్మినా.. కరోనా అని భయపడే రోజులివి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలే గజగజ వణుకుతున్న సందర్భమిది. ఎవరింట్లో వాళ్లే.. ఎక్కడోళ్లు అక్కడే.. అడుగు పెడితే మహమ్మారి ఎక్కడ ఎటాక్‌ చేస్తుందోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో వీరు ధైర్యంగా సేవలందిస్తున్నారు. వారే.. ఆశా కార్యకర్తలు.
ప్రజాశక్తి -  హైదరాబాద్‌ బ్యూరో
అందరి ఆరోగ్య సమస్యలకు భరోసా కల్పిస్తున్న ఆశా వర్కర్ల కష్టాలకు మాత్రం విముక్తి లేదు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించడం లేదు. కనీస వేతనాల అమలు అసలే లేదు. స్కీం వర్కర్లుగా ఎంతో శ్రమకోర్చి కష్టపడుతున్నా.. కార్మిక హక్కులు వర్తించట్లేదు. ఇతర సౌకర్యాలు ఏమీ వర్తించటం లేదని ఆందోళన చెందుతున్నారు. దీంతో దేశవ్యాపితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీం వర్కర్ల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈ నెల 7,8 తేదీల్లో దేశవ్యాపిత సమ్మెలోనూ, 9న జైల్‌భరో కార్యక్రమాల్లో పాల్గనాలని భావిస్తున్నారు. ఈ మేరకు వారు సన్నద్ధమవుతున్నారు.
అహర్నిశలు శ్రమ..
గ్రామీణ స్థాయిలో ప్రజలకు వారు ఆశా కిరణాల్లా ఉన్నారు. ప్రమాదకరమైన కరోనా నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా.. తగిన సూచనలిస్తున్నారు. నిరంతర హ్యాండ్‌వాష్‌, మాస్కు ధరించడం తదితర జాగ్రత్తల పట్ల అప్రమత్తం చేస్తున్నారు. అవసరం మేరకు సర్కారు దవాఖానాలకు రిఫర్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు కలిగిన అనుమానితులను సంబంధిత అధికారులతో మాట్లాడి వైద్యశాలకు తరలించడంలో వీరి పాత్ర కీలకం. ఇలా రోజుకు ఒక్కొక్కరు 20నుంచి 30 ఇళ్లు సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ప్రాధమిక సమాచారం సేకరించడంతో పాటు వైద్యసేవలు అందించేందుకు మండలాల పరిధిలోని పల్లెపల్లెకూ సేవలను విస్తరింప జేశారు. జనాభా ప్రాతిపదికన 1000 నుంచి 1500 మందికి ఒక ఆశా వర్కర్‌ చొప్పున తమ సేవలనందిచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆశావర్కర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహమ్మారి నియంత్రణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఆశాలకు ఏది సేఫ్టీ..
జిల్లాలో 1330 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరు ఇంటింటికి తిరిగి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. రోజుకు సుమారు 35 వేల మందిని కలుస్తున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. కానీ, వీరికి మాత్రం ఎలాంటి సేప్టీ పరికరాలు లేవు. ఇదేమిటని వర్కర్లను అడిగితే.. ప్రభుత్వం మాకివ్వడం లేదని చెబుతున్నారు. సొంతంగా తామే మాస్కులు, గ్లౌజులు, శానిటేజర్లు కొనుక్కొంటున్నామని చెప్పడం ఆందోళనకరం. మాస్కులు లేకుంటే కేసులే అని ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తూనే ఆశా వర్కర్లకు కావలసిన మెటీరియల్‌ అందించకపోతే వారి సేఫ్టీ ఎక్కడిదని పలువురు ప్రశ్నిస్తున్నారు.