Oct 22,2020 23:35

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి

ప్రజాశక్తి కాకినాడ రూరల్‌ '2020-21ను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం కొబ్బరి సంవత్సరంగా ప్రకటించడం అభినందనీయమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.' ఉద్యాన విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో నిడదవోలు ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌ నాయుడుతో కలసి మంత్రి కన్నబాబు పాల్గొని శాస్త్రవేత్తలు, అధికారులతో మాట్లాడారు. కొబ్బరి సాగును ఆధునికీకరించి, విలువ ఆధారిత పంటగా అభివృద్ధి చేసేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలన్నారు. కొబ్బరి సాగులో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో కొబ్బరి ఆధారిత పథకాలకు సంబంధించి పోస్టర్లు, కరపత్రాలను సిద్ధం చేసి, అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత పథకాల ద్వారా నూతన కొబ్బరి ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే విధంగా యువత, మహిళా సంఘాల సభ్యులను ప్రోత్సహించాలని తెలిపారు. రైతులకు కొబ్బరి సాగు లాభసాటిగా ఉండే విధంగా సైంటిస్ట్‌ల పరిశోధనలు ఉండాలని, కొబ్బరి సాగు చేసే ప్రాంతాల్లో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రకటించిన 2020-21 కొబ్బరి సంవత్సరానికి సార్థకత చేకూరాలంటే తప్పనిసరిగా శాస్త్రవేత్తలు, అధికారులు సమన్వయంతో పనిచేసి, మంచి ఫలితాలు రాబట్టాలని పేర్కొన్నారు. అనంతరం ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించిన ఇయర్‌ ఆఫ్‌ కోకోనట్‌ లోగోను మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి, పరిశోధన సంచాలకులు డాక్టర్‌ విఎస్‌కె.రెడ్డి, విస్తరణ సంచాలకులు డాక్టర్‌ బి.శ్రీనివాసులు, విసి డాక్టర్‌ టి.జానకిరామ్‌ పాల్గొన్నారు.