- నిలకడ లేని ధరలతో మరింత నష్టం
- మందగించిన ఎగుమతులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి : కొబ్బరి రైతుకు మరో కష్టం ఎదురైంది. జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ధరలు మరింత పతనమయ్యాయి. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో కొబ్బరి రైతులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్‌లో కొత్త కొబ్బరి వెయ్యి కాయలు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్యలో ధర పలుకుతోంది. గతేడాది ఈ సీజన్‌లో రూ.9 వేల నుంచి రూ.10 వేలకు వరకూ ధర పలకింది. కురిడి కొబ్బరి వెయ్యి కాయలు పాత గండేరా రకం రూ.12 వేలుగా ఉంది. గతేడాది రూ.13 వేలు చొప్పున కొనుగోలు చేశారు. గటగట రకం కొబ్బరి కాయలు గతేడాది రూ.11 వేలు ఉండగా.. ఈ ఏడాది రూ.9 వేలకు మించి లేదు. కురిడి చిట్టి కాయలు గతేడాది వెయ్యి కాయలు రూ.5,500లు ఉండగా ప్రస్తుతం ఇది రూ.4 వేల లోపు ఉంది. నీటి కాయల ధర గతం కంటే రూ.3 వేలకు పడిపోయింది. ప్రస్తుతం వీటి ధర రూ.8 వేలుగా ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది రైతు వద్ద కాయ ఒక్కటి రూ.11 వరకు పలికింది. పరిమాణాన్ని బట్టి వ్యాపారులు వెయ్యి కాయలను రూ.11 వేల నుంచి రూ.13 వేలకు చొప్పున కొనుగోలు చేసి ఎగుమతి చేశారు. ప్రస్తుతం కేరళలో దిగుబడులు భారీగా రావడంతో దేశీయ మార్కెట్లో కోనసీమ కొబ్బరికి డిమాండ్ తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రొయ్యల చెరువులు పెరగడంతో ఆ ప్రభావం కొబ్బరి కాయల నాణ్యత, దిగుబడులపై చూపుతోందని, దీంతో ప్రతిఏటా నష్టాలు చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
1.30 లక్షల ఎకరాల్లో సాగు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. మరో 20 వేల ఎకరాలకు సరిపడా చెట్లు ఇళ్ల వద్ద, పొలాల గట్ల వెంబడి, కాలువ గట్లపైన ఉన్నాయి. ప్రతియేటా జిల్లాలో 105 కోట్ల కొబ్బరి కాయల దిగుబడి వస్తుందని అంచనా. జిల్లా నుంచి తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు కొబ్బరిని ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. అంబాజీపేట మార్కెట్ నుంచి గత శ్రావణ మాసంలో రోజుకు 25 నుంచి 30 లారీలు ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 లారీలకు మించి ఎగుమతులు జరగడంలేదని వ్యాపారులు చెబుతున్నారు.
వెంటాడుతున్న చీడపీడలు
రెండేళ్లుగా కొబ్బరి దిగుబడి తగ్గడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోపక్క ఐదేళ్లుగా కొబ్బరి చెట్లకు ఎర్రనల్లి, తెల్లదోమ, ఆకు తేలు, ఎండాకు తెగులు సోకుతున్నాయి. దీంతో ఆకులు ఎండిపోయి, చెట్లు జీవం కోల్పోవడంతోపాటు పూతకు వచ్చిన గెలల్లో కాయలు తొలిదశలోనే రాలిపోతున్నాయి. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దిగుబడి అవుతున్న కాయలతో పోల్చితే ఇక్కడ కాయల సైజు తక్కువగా ఉండడంతో జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతుంది.

పెట్టుబడి కూడా రావడం లేదు
గండేరా కురిడి కాయలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూ.18 వేలు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం రూ.12 వేల నుంచి రూ.12,500 మించి ధర లేదు. శ్రావణంలోనూ ధరలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ధరా లేక అటు ప్రభుత్వ సాయం అందక కుదేలవుతున్నాం. కూలి పనికి వెళ్లే స్థితికి వచ్చాం.
- సుంకర సత్యనారాయణ, వాకల గరువు, కొబ్బరి రైతు, అంబాజీ పేట

ఖర్చులు పెరిగాయి
కొబ్బరి సాగుకు ఏడాదికి రూ.40 వేలు పెట్టుబడి అవుతోంది. నీళ్లపోత, ఎరువులు, పురుగు మందులు, దింపు, ఒలుపు, రవాణా ఖర్చులు పెరగడంతో పెట్టుబడి కూడా రావడంలేదు. ఆక్వా సాగు ప్రభావం తోటలపై తీవ్రంగా ఉంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. తమిళనాడు తరహాలో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలి.
- ముత్యాల జమ్మీలు, కొబ్బరి రైతు, అంబాజీపేట










