న్యూఢిల్లీ : బాలాకోట్ దాడుల గురించి ముందే లీక్ అయిన విషయం రిపబ్లికన్ టివి అధినేత అర్నబ్ గోస్వామి వాట్సప్ చాట్స్ ద్వారా వెల్లడవ్వడంపై కేంద్రం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తప్పుబట్టారు. జాతి భద్రతను తాకట్టు పెట్టారంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ..నూతన వ్యవసాయ చట్టాల పట్ల కేంద్రం అహంకార పూరితంగా వ్యవహరించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో జాతి భద్రత పూర్తిగా రాజీ పడిందనే విషయంపై ఆందోళన కలిగించే నివేదికలు వచ్చాయని, కొద్ది రోజుల క్రితం మాజీ రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ సైనిక కార్యకలాపాలకు సంబంధించిన రహస్యాలు లీక్ చేయడం దేశ ద్రోహమే అవుతుందని, అయినప్పటికీ ప్రభుత్వం నిశ్శబ్ధంగా ఉండిపోయిందని...చెవిటిదయ్యిందని విమర్శించారు. దేశ భక్తి..జాతీయ వాదం వంటి పాఠాలు వల్లె వారి అసలు రహస్యాలు బయటపడ్డాయని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. టిఆర్‌పి కుంభకోణంలో అరెస్టైన అర్నబ్..వాట్సప్ చాట్లను పరిశీలించగా..ఈ విషయం వెలుగుచూసిన సంగతి విదితమే.










