- కాంగ్రెస్ అధ్యక్ష రేసులో లేను
- రాజస్థాన్ పరిణామాలపై గెహ్లాట్ క్షమాపణలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ వర్గం తిరుగుబాటుతో అసంతృప్తి చెందిన సోనియా గాంధీ ఆయనను పోటీ నుంచి తప్పించారు. బుధవారం సాయంత్రం నుంచి పడిగాపులు కాసిన గెహ్లాట్‌కు ఎట్టకేలకు గురువారం అపాయింట్మెంటు ఇచ్చిన సోనియా గాంధీ ఆయన్ను గట్టిగా మందలించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో కలిసి ఆయన సోనియా గాంధీతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో సోనియా అన్ని విషయాలపై నిలదీశారు. ఇటీవల రాజస్థాన్‌లో గెహ్లాట్ వర్గీయులు తీరు, తాను ఏమీ చేయలేనంటూ గెహ్లాట్ చేతులెత్తేయడంపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ రాజస్థాన్ అసమ్మతి.. పార్టీకి చెడ్డపేరు తెచ్చిందని సోనియా కన్నెర్ర చేశారు. రాజస్థాన్ అసమ్మతిని అదుపు చేయలేని నాయకుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎలా నడపగలరని ప్రశ్నించారు. గెహ్లాట్ తన నమ్మకాన్ని వమ్ము చేశారని కూడా ఆమె అన్నట్లు సమాచారం. సోనియాతో సమావేశం తర్వాత అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో లేనని, ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు తాను సిఎంగా ఉండాలా? వద్దా? అనేది కూడా సోనియా నిర్ణయిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడైన కార్యకర్తనని అన్నారు. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. రాజస్థాన్‌లో తన మద్దతుదారుల తీరుపై సోనియాకు క్షమాపణలు చెప్పానని గెహ్లాట్ తెలిపారు. రాజస్థాన్ తదుపరి సిఎంపై సోనియా గాంధీ ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని కెసి వేణుగోపాల్ అన్నారు.










