Dec 06,2020 22:18

నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-తాడిపత్రి    తాడిపత్రి ప్రాంతంలో సిపిఎం, కార్మిక సంఘాల ఏర్పాటుకు కామ్రేడ్‌ ఆదినారాయణరెడ్డి పునాది వంటి వారని సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. కామ్రేడ్‌ ఆదినారాయణ రెడ్డి 16వ వర్థంతి సభను స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆదినారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిగా, యూనియన్‌ నాయకుడిగా ఆదినారాయణ రెడ్డి గొప్ప సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో అనేక చోట్ల సిఐటియు కార్మిక సంఘాలను నిర్మించారని అన్నారు. తాడిపత్రి ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాల వెనుక ఆయన కషి మరువలేనిదని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాబోయే రోజులలో మరింతగా కార్మిక సంఘాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పోరాటాలను జయప్రదం చేయడం ద్వారానే కామ్రేడ్‌ ఆదినారాయణ రెడ్డికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని అన్నారు. ఉద్యమకారులకు మరణం ఉండదని తాడిపత్రి ప్రాంతంలో కార్మిక ఉద్యమ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన కామ్రేడ్‌ ఆదినారాయణరెడ్డి అమరుడు అని అన్నారు. తాడిపత్రిలో బీడీ కార్మిక సంఘం ఏర్పాటుపై యజమానులు ఆయనను వ్యతిరేకించారన్నారు. సంఘం ఏర్పాటు అయితే రాజకీయంగా నష్టం జరుగుతుందని సంఘాన్ని ఏర్పాటు చేయకుండా చిన్న వాటికి ఆయనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుకుని భయభ్రాంతులకు గురిచేసేవారని తెలిపారు. అంతటి వ్యతిరేక పరిస్థితులలో కూడా తాడిపత్రిలో సిఐటియు నిర్మాణానికి ఆయన కషి చేశారని గుర్తు చేశారు. కుటుంబ సమస్యల కంటే కూడా సమాజంలోని సమస్యలకే తన జీవితాన్ని కేటాయించారన్నారు. తన ఫ్యాక్టరీ మూతపడి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని, అనుకోని పరిస్థితుల్లో అకారణంగా ఆయన గుండెపోటుతో మరణించారని తెలిపారు. 8 జరిగే దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు నరసింహారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, సిఐటియు నాయకులు వన్నూరప్ప, అంగన్వాడీ నాయకురాలు నాగేశ్వరమ్మ, కెవిపిఎస్‌ నాయకులు రామ్మోహన్‌, నాగరాజు, చంటి, ఎలక్ట్రిసిటీ నాయకులు జిలాన్‌, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.