న్యూఢిల్లీ : భారతదేశంలో హరిత విప్లవానికి మార్గదర్శకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (98) మృతికి సిపిఎం పొలిట్ బ్యూరో తన ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది. పొలిట్‌బ్యూరో ఈ మేరకు గురువారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. 1960 దశకంలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి పరిచి, ప్రాచుర్యం కల్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపుగా 1987లో స్థాపించబడిన ప్రపంచ ఆహార బహుమతిని మొదటిసారిగా అందుకున్నారని గుర్తు చేసింది. 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. రైతులపై జాతీయ కమీషన్ అధ్యక్షులుగా కనీస మద్దతు ధరను అందించాలని సిఫారసు చేశారు. వ్యవసాయ ఉత్పత్తి సమగ్ర వ్యయానికి 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర ఉండాలన్న స్వామినాథన్ సిఫారసు. రైతుల పోరాటాల్లో ఇప్పటికీ ఒక ముఖ్యమైన డిమాండ్‌గా ఉందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. మోడీ ప్రభుత్వం దీనిపై హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడానికి ఇష్టపడడం లేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది.










