శ్రీనగర్ : జమ్ము జిల్లాలో రికార్డు స్థాయిలో 350కిపైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. జమ్ము ప్రాంతంలో 486కి పైగా డెంగ్యూ కేసులను గుర్తించామని, అయితే ఒక్క జమ్ము జిల్లాలోనే 350కి పైగా కేసులు వచ్చాయని సోమవారం సిటీలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రికి చెందిన వైద్యులు తెలిపారు. కథువాలో 46 కేసులు రాగా, సాంబ జిల్లాలో 42 కేసులు, రాజౌరీలో పది, రెయిసీలో ఎనిమిది, ఉదమ్‌పూర్‌లో ఐదు, పూంచ్‌లో ఆరు, దోడాలో నాలుగు, కిష్త్వార్‌లో ఓ కేసు నమోదవగా, కాశ్మీర్‌లో నాలుగు, ఇతర ప్రాంతాలలో మూడు కేసులు వచ్చాయని అన్నారు.
జమ్ముప్రాంతంలోని జమ్ము, కథువా, సాంబ జిల్లాల్లో అత్యధిక కేసులు వచ్చాయని, 77 కేసుల్లో 33 కేసులు శని, ఆదివారం ఈ రెండు రోజుల్లోనే నమోదయ్యాయని అన్నారు. వీరిలో అధిక శాతం మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వంద మంది దాకా డిశ్జార్జ్ అయ్యారని చెప్పారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. బ్లడ్ బ్యాంకులలో రోగులకు అవసరమైన ప్లేట్ లెట్స్ అందుబాటులో ఉన్నాయని బ్లడ్ బ్యాంక్ హెచ్‌ఓడి డా. మీనా సింధు తెలిపారు.










