Oct 02,2023 12:10

పాట్నా : బీహార్‌లో డెంగీ కేసులు విజృంభిస్తున్నాయి. సెప్టెంబర్‌ నెలలో రాష్ట్రంలో 6,146 కేసులు నమోదయ్యాయి. గత ఐదేళ్లలో సెప్టెంబర్‌లో నమోదైన కేసుల విషయంలో ఇదే అత్యధికం. రాష్ట్ర వైద్య విభాగం సమాచారం ప్రకారం బీహార్‌లో ఈ ఏడాదిలో 6,421 డెంగీ కేసులు నమోదు కాగా, సెప్టెంబర్‌లోనే 6,146 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ప్రకారం ఈ ఏడాదిలో సెప్టెంబర్‌ 17 వరకూ బీహార్‌లో డెంగీతో ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో శుక్రవారం 416 కేసులు నమోదు కాగా, ఒక్క రాజధాని పాట్నాలోనే 177 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మొత్తంగా బీహార్‌లో 13,972 కేసులు నమోదయ్యాయి. డెంగీకి కారణమయ్యే వైరస్‌ దేశంలో వేగంగా అభివృద్ధి చెందినట్లు కొన్ని సంస్థలు అధ్యయనంలో వెల్లడయింది. డెంగీ కేసులు విజంభిస్తున్నా భయపడాల్సిన అవసరం లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం, శరీరాన్ని కప్పి ఉంచుకోవడం ద్వారా డెంగీ వ్యాప్తిని అరికట్టవచ్చునని తెలిపారు. దోమలను నిర్మూలిం చడం, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలను గుర్తించి తొలగించడంతో వ్యాప్తిని అడ్డుకోవచ్చునని చెప్పారు.