బెంగళూరు : ప్రముఖ కార్టూనిస్ట్ అజిత్ నినాన్ (68) శుక్రవారం ఉదయం మరణించారు. మైసూరులోని ఆయన ఫ్లాట్‌లో మరణించినట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ వి.జి. నరేంద్ర పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆయన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలిపారు. ఆయన భార్య , ఇద్దరు పిల్లలు గోవాలో ఉంటున్నట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ, దేశ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సందించడంలో కీలక భూమిక పోషించారు. ఇండియా టుడేలో 'సెంట్రస్టేజ్ ' సిరీస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 'నినాస్ వరల్డ్' పేర్లతో అజిత్ పలు కార్టూన్‌లు ప్రచురితమయ్యాయి. అలాగే చిన్నారుల మేగజైన్‌లో ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్ 'డిటెక్టివ్ మూచ్చావాలా' తో ప్రసిద్ధి పొందారు. గతేడాది ఆగస్టులో అజిత్ నినాన్‌ను బెంగళూరులోని ఇండియన్ కార్టూన్ గాలరీలో బార్టాన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించినట్లు నరేంద్ర తెలిపారు.










