Jul 19,2023 06:57
  • 26 ప్రతిపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయం
  • ముంబయిలో తదుపరి భేటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ నూతన కూటమికి భారత జాతీయాభివృద్ధి సమిష్టి కూటమి (ఇండియా) అనే పేరు ఖరారు చేశాయి. ఐ - ఇండియన్‌, ఎన్‌ - నేషనల్‌, డి - డవలప్‌మెంటల్‌, ఐ - ఇంక్లూజివ్‌, ఎ - అలయెన్స్‌ (ఐఎన్‌డిఐఎ)గా అభివర్ణించాయి.
బెంగళూరులో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం మంగళవారం ముగిసింది. కూటమి పేరును ఇండియాగా 26 ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, టిఎంసి, డిఎంకె, ఆప్‌, జెడియు, సిపిఎం, సిపిఐ, ఆర్‌జెడి, జెఎంఎం, ఎన్‌సిపి, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌ఎల్‌డి, అప్నాదళ్‌ (కె), నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఆర్‌ఎస్‌పి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎండిఎంకె, విసికె, కెఎండికె, ఎంఎంకె, ఐయుఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (ఎం), కేరళ కాంగ్రెస్‌ (జోసఫ్‌) పార్టీలు పాల్గొన్నాయి.
అనంతరం ఏర్పాటు చేసిన ఉమ్మడి విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన కో-ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేయాలనినిర్ణయించామన్నారు. ఆ కమిటీ కూర్పు, కన్వీనర్‌ పేరు తరువాత ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి సమావేశం ముంబయిలో జరుగుతుందని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఐఎన్‌డిఐఎ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

  • ఉమ్మడి తీర్మానం

కుల గణనను అమలు చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. సమావేశ అనంతరం 26 పార్టీలు 'సామూహిక్‌ సంకల్ప్‌ (ఉమ్మడి తీర్మానం)లో విడుదల చేశాయి. ''సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. మొదటి దశగా, కుల గణనను అమలు చేయాలి'' అన్న తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ''మైనారిటీలపై ద్వేషం, హింస'' అలాగే ''మహిళలు, దళితులు, గిరిజనులు, కాశ్మీరీ పండిట్లపై పెరుగుతున్న నేరాలను'' ఓడించేందుకు తామంతా కలిసి ఒకే వేదికపైకి వచ్చామని ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన భారతదేశ ఆలోచనను కాపాడేందుకు ధృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ''మన గణతంత్ర స్వరూపంపై బిజెపి ఒక పథకం ప్రకారం దాడి చేస్తోంది. దేశ చరిత్రలో మనం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. భారత రాజ్యాంగ పునాది స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక న్యాయం, సమాఖ్యవాదం ఒక పథకం ప్రకారం భయానకంగా అణగదొక్కబడుతున్నాయి'' అని విమర్శించాయి.

  • రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే  బిజెపిని గద్దె దించాల్సిందే : ఏచూరి

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశ సారాంశాన్ని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి వివరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్టు చేశారు. ఆయన మాటల్లోనే.. 'బెంగళూరు సమావేశానికి హాజరైన పార్టీల మధ్య ఉన్న లౌకిక ప్రత్యామ్నాయ అవగాహన ఏదైతే ఉందో అది ఇండియా (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌)గా రూపుదిద్దుకుంది. ఇది ప్రధానమైనది. రాజ్యాంగ లౌకిక, ప్రజాతంత్ర లక్షణాలను దెబ్బతీసేందుకు మోడీ సర్కార్‌ పాల్పడుతున్న వినాశకర చర్యల నుంచి పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారం నుంచి బిజెపిని గద్దె దించాల్సిందే. ఈ దిశగా అన్ని పార్టీలూ సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయించాం. రాష్ట్రాల పరిధిలో సహకరించుకోవడం ద్వారా మాత్రమే ఇది పనిచేస్తుందని సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ దిశగా సంబంధిత రాష్ట్రాల్లోని పార్టీలు చర్చలు చేపట్టాలి. బిజెపి వ్యతిరేక ఓటు సాధ్యమైనంత మేరకు చీలిపోకుండా ఎత్తుగడలు రూపొందించాలని, అలాగే గత పదేళ్లుగా వ్యతిరేక ఓటు చీలికను తనకు అనుకూలంగా మలచుకొని బిజెపి ఏ విధంగా లబ్ధి పొందుతూ వస్తున్నదో.. దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సమావేశంలో నిర్ణయించాం. ఈ దిశగా రాష్ట్రాల్లో సంప్రదింపులు మొదలుకానున్నాయి. ముంబయిలో వచ్చేనెలలో నిర్వహించే తదుపరి సమావేశానికి మహారాష్ట్ర వికాస్‌ అఘాది కూటమి ఆతిథ్యమివ్వనుంది.' అని ఏచూరి పేర్కొన్నారు.

  • ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు: మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదని అన్నారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు వున్నా, అవి అధిగమించలేనంత వేమీ కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చని చెప్పారు. నిరుద్యోగం, అధిక ధరలు వంటి ప్రజా సమస్యలతో బాటు హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన 26 పార్టీలకు తగినంత రాజకీయ బలం ఉందని అన్నారు. 11 రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. బిజెపి 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలను దక్కించుకుందని, ఈ స్థానాలను ఆ పార్టీ తనంతట తాను గెలుచుకోలేదని అన్నారు.బిజెపి తన మిత్ర పక్షాల ఓట్లను పొంది, అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత ఆ మిత్ర పక్షాలను వదిలేసిందని పేర్కొన్నారు. ఇప్పుడు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, ఇతర నేతలు రాష్ట్రాల్లో తిరుగుతూ, పాత మిత్రులతో సత్సంబంధాల కోసం దేవులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్‌డిఎ సమావేశానికి 38 పార్టీలు వచ్చాయని అంటున్నారని, అయితే అవి రిజిష్టర్‌ అయినవేనా? అని ఎద్దేవా చేశారు.

  • నవ భారతం కోసం కలలు కంటున్నాం: అరవింద్‌ కేజ్రీవాల్‌

తొమ్మిదేళ్ల క్రితం ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీకి ఓటేయడంతో దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందని, అయితే ఈ తొమ్మిదేళ్లలో ఒక్క రంగం కూడా పురోగతి సాధించలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఈ 26 పార్టీలు నవ భారతం కోసం కలలు కంటున్నాయని అన్నారు.

  • ఇది భారత్‌ గొంతు కోసం జరుగుతున్న పోరాటం: రాహుల్‌ గాంధీ

''ఈ సమావేశంలో పాల్గొనడం నాకు గౌరవం. ఇండియా అనే భావవపై దాడి జరుగుతోంది. కోట్లాది మంది భారతీయుల నుంచి ఇండియా గొంతును లాక్కొని నరేంద్ర మోడీ తన సన్నిహితులైన కొంతమంది వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఇది భారత్‌ గొంతు కోసం జరుగుతున్న పోరాటం. అందుకే ఇండియా పేరును ఖరారు చేశాం. ఎన్‌డిఎ వర్సెస్‌ ఇండియా, నరేంద్ర మోడీ వర్సెస్‌ ఇండియా, ఇండియా వర్సెస్‌ హిందుత్వ సిద్ధాంతం మధ్య పోరాటం ఇది. ఒక సమూహంగా తాము భారత రాజ్యాంగాన్ని, ప్రజల గొంతును పరిరక్షిస్తున్నాము. భారత్‌ అనే భావనకు ఎదురు నిలబడితే ఎవరు గెలుస్తారో మనందరికీ తెలుసు'' అని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశం పట్ల మన దృక్పథాన్ని వివరించే ఒక 'యాక్షన్‌ ప్లాన్‌'తో ముందుకు రావాలని మేము నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నిరుద్యోగం పెరిగిపోతోందని, ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, వీటి గురించి తమ ఆందోళనంతా అని రాహుల్‌ చెప్పారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళుతోందని విమర్శించారు. ''ఈ పోరాటం కేంద్రం, ప్రతిపక్షాల మధ్య కాదు. ఇది అణచివేయబడుతున్న భారతదేశం గొంతు కోసం పోరాటం. అందుకే మేము ఇండియా పేరును ఎంచుకున్నాము'' అని రాహుల్‌ గాంధీ అన్నారు.

  • దేశం మా కుటుంబం, దాని కోసం పోరాడుతాం : ఉద్ధవ్‌ ఠాక్రే

'కుటుంబం కోసమే' ప్రతిపక్షాలు బెంగుళూరులో సమావేశమవుతున్నాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్దవ్‌) అధినేత, ఉద్దవ్‌ థాకరే దీటుగా తిప్పికొట్టారు. ''అవును, దేశం మొత్తం మా కుటుంబం. మేము దాని కోసం పోరాడుతున్నాము'' అని అన్నారు. ''ప్రజల మనస్సులలో తదుపరి ఏమి జరుగుతుందో అనే భయం ఉంది. కాబట్టి చింతించకండి. మేము ఇక్కడ ఉన్నామని మేము వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. ఒక వ్యక్తి, లేదా ఒక పార్టీ దేశం కాదు. దేశం ప్రజలందరిది'' అని అన్నారు.
ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ (కాంగ్రెస్‌), సీతారాం ఏచూరి (సిపిఎం), డి.రాజా (సిపిఐ), తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ (డిఎంకె), బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ (జెడియు), పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ (టిఎంసి), ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ (ఆప్‌), జార్ఖండ్‌ సిఎం హేమంత్‌ సొరెన్‌ (జెఎంఎం), లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ (ఆర్‌జెడి), శరద్‌ పవార్‌ (ఎన్‌సిపి), అఖిలేష్‌ యాదవ్‌ (ఎస్‌పి), ఉద్దవ్‌ ఠాక్రే (శివసేన), ఒమర్‌ అబ్దుల్లా (నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబుబా ముఫ్తీ (పిడిపి), వైకో (ఎండిఎంకె), దీపాంకర్‌ భట్టాచార్య (సిపిఐఎంఎల్‌), ఇఆర్‌ ఈశ్వరన్‌ (కెఎండికె), కెఎం ఖాద్రీ మోహిద్దీన్‌ (ఐయుఎంఎల్‌), జయంత్‌ చౌదరి (ఆర్‌ఎల్‌డి) తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మృతికి సంతాప సూచకంగా కొద్ది సేపు మౌనం పాటించారు.