Mallikarjun Kharge : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రతిపక్షాల సమావేశం : మల్లిఖార్జున ఖర్గే
బెంగళూరు : వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో బిజెపి ఓడించాలనే లక్ష్యంతో దేశంలోని 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమైన సంగతి తెలిసిందే. రెండోరోజు (మంగళవారం) కొనసాగుతున్న ప్రతిపక్షపార్టీల సమావేశంలో ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన ప్రసంగంలో 'దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించే వ్యూహాలపైనే ప్రతిపక్షపార్టీలు చర్చించుకోవడం జరుగుతుంది అని ఖర్గే అన్నారు. ఈ సందర్భంగా ఆయన 'దేశంలో అధికారంలోకి రావాలని, ప్రధాని పదవి చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఈ సమావేశంలో మా ఉద్దేశం మాకు అధికారం దక్కడం కాదు.. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని రక్షించడమే ధ్యేయం' అని అన్నారు.
కాగా, రాష్ట్రస్థాయిలో ప్రతిపక్షపార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని ఖర్గే ఎత్తిచూపారు. అయితే ఆ విభేధాలు సైద్ధాంతికమైనవి కావు అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా కష్టాలు పడుతున్న సామాన్యులు, మధ్యతరగతి ప్రజల కోసం, నిరుద్యోగంతో బాధపడుతున్న మన యువత కోసం పేదలు, దళితులు, ఆదివాసీలు.. నిశ్శబ్ధంగా నలిగిపోతున్న మైనార్టీ హక్కులు.. ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపక్షపార్టీల మధ్య ఉన్న ఈ విభేదాలు పెద్దవి కావు' అని ఖర్గే అన్నారు. ప్రస్తుతం సమావేశానికి హాజరైన 26 ప్రతిపక్షపార్టీలు కలిసే ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలో ఉన్నాయి. మిత్రపక్షాల ఓట్లు లేకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపి 303 సీట్లు దక్కించుకోవడం చాలా కష్టం అని ఖర్గే అన్నారు.










