Oct 21,2023 17:00
  • అధికారుల తీరుపై ఆగ్రహం

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద అధికారుల తీరుపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారుల వ్యవహార శైలి పట్ల ఆయన అసహనం వెలిబుచ్చారు. భోజనాలు, దర్శనాల్లో అధికారుల అజమాయిషీపై తీవ్రంగా స్పందించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు జరిగేలా చూడాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ కు, పోలీస్‌ కమిషనర్‌కు నోట్‌ పంపారు. వీఐపీ మార్గం అంటే టికెట్‌ లేకుండా వెళ్లే మార్గం అయిందని మంత్రి వ్యాఖ్యానించారు. వీఐపీ టికెట్టు దర్శనంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మూలా నక్షత్రం సందర్భంగా నిన్న అమ్మవారిని 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. సోమవారం కూడా రెండు లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.