Oct 23,2023 19:48

ప్రజాశక్తి-విజయవాడ: దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం కన్నులపండువగా సాగింది. ఇంద్రకీలాద్రి నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మహిళల కోలాటాలు, నడుమ ఊరేగింపుగా కృష్ణానది వద్దకు తీసుకువచ్చి, దుర్గాఘాట్‌లో సిద్ధంగా ఉంచిన హంస వాహనంలో ఉంచి, పూజలు నిర్వహించారు. మూడు మార్లు ఉత్సవవిగ్రహాలకు జలవిహారం చేయించనున్నారు. దుర్గాఘాట్‌ నుంచి ప్రారంభమైన తెప్పోత్సవాన్ని చూడటానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. హంసవాహనం పైనకేవలం 31 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతుల మధ్య తెప్పోత్సవం జరుగుతోంది. మూడేళ్ల తర్వాత భక్తులకు స్వామివారు నదీవిహారం చూసే భాగ్యాన్ని కల్పించారు. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో బాణా సంచా సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గాఘాట్‌తో పాటు ప్రకాశం బ్యారేజ్‌ నుంచి తెప్పోత్సవాన్నిభక్తులు వీక్షించారు.