- టిటిడి తరుఫున అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
ప్రజాశక్తి-వన్‌టౌన్: విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా మహాోత్సవాల రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే దుర్గమ్మను దర్శించుకునేందుకు దేవాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. గాయత్రీదేవి అలంకృత అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మేకా శేషుబాబు, గడిరాజు వెంకట సుబ్బరాజు టిటిడి తరుఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డిసిపి విశాల్ గున్ని, దేవాలయ ఇఒ కెఎస్.రామారావు, చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు రెడ్ క్రాస్ వలంటీర్లు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలు కళాశాలల విద్యార్థులు సేవా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. నడవలేని వారిని వీల్ చైర్ ద్వారా తీసుకెళ్లడం దర్శనం చేయిస్తున్నారు. కొన్ని సంస్థలు పసిపిల్లలకు పాలు, క్యూలైన్లోని వారికి తాగునీరు అందిస్తున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి రాధిక అశోక్ మాట్లాడుతూ మూడు షిఫ్ట్‌ల్లో 60 మంది యువ కార్యకర్తలు సేవలందిస్తున్నారని తెలిపారు.











