Oct 20,2023 11:07
  • ఎన్‌ఎండిసి స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించం
  • జగదల్‌పూర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖబ్యూరో : ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రయివేటీకరణ అజెండాను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టినట్టు స్పష్టమవుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఏ రకంగా అయితే అమ్మకానికి మోడీ సర్కారు పెట్టిందో ఛత్తీష్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలోగల ఎన్‌ఎండిసి నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌పైనా ఇదే విధానంతో వెళ్లి తాజాగా వెనకడుగు వేయడం శుభపరిణామం. ఛత్తీష్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌లో గురువారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. 'ఎన్‌ఎండిసి స్టీల్‌ప్లాంట్‌ (నాగర్‌నార్‌) బస్తర్‌ జిల్లా ప్రజలకు చెందినది దాన్ని ప్రయివేటీకరించబోము' అంటూ వ్యాఖ్యనించారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ను బిజెపి ప్రయివేటీకరిస్తోందని, బస్తర్‌ జిల్లా మనోభావాలను దెబ్బతీస్తుందంటూ కాంగ్రెస్‌ చేపట్టిన ప్రచారంతో బిజెపిలో వణుకుపుట్టింది. నవంబర్‌ 7, 17న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని బిజెపి భావించింది. దీంతో ప్లాంట్‌ను ప్రయివేటీకరించబోమని అమిత్‌ షా ప్రకటించారు.
 

                                                శుభపరిణామం: ఉక్కు పరిరక్షణ కమిటీ కో-కన్వీనర్‌ అయోధ్యారామ్‌

నాగర్‌నార్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఉపసంహరించుకున్నట్లు అమిత్‌ షా ప్రకటించడాన్ని స్టీల్‌ప్లాంట్‌ కార్మికవర్గం హర్షం వ్యక్తం చేస్తుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ జె.అయోధ్యారామ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలుపుదలకు ఈ ప్రాంత ప్రజలు, కార్మికవర్గం చేస్తోన్న పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పదన్నారు.