Jun 25,2023 08:29
  • బాధితులకు పునరావాసం, ప్యాకేజి
  • అఖిలపక్షంలో వివిధ పార్టీల డిమాండ్‌
  • ప్రధాని మోడీ గైర్హాజరుపై నిలదీత
  • మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదు : అమిత్‌ షా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌ హింసను నిలువరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌కు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని వివిధ రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అఖిలపక్షాన్ని పంపాలని డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడాన్ని తీవ్రంగా విమర్శించాయి. శనివారం నాడిక్కడ పార్లమెంట్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన మణిపూర్‌ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని హాజరుకాకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి. మణిపూర్‌లో పరిస్థితి అదుపులో లేదని అమిత్‌ షా తొలిసారి బహిరంగంగా అంగీకరించారు. తనను విశ్వసించాలని, ఈ విషయంపై ప్రధాని సూచనలు ఇస్తున్నారని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 131 మంది మరణించారని, హింస, దోపిడీ సహా 5,036 ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. 5,889 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 144 మందిని అరెస్టు చేశారు. వివాదాలకు కారణమైన కేసును హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవచ్చని అమిత్‌ షా అన్నారు.
 

                                            ప్రధాని ఒక్కసారి కూడా మణిపూర్‌ వైపు చూడలేదు : ఓక్రమ్‌ ఇబోబీ సింగ్‌

మణిపూర్‌ భారత్‌లో భాగమని, ప్రధాని ఒక్కసారి కూడా ఆ రాష్ట్రం వైపు చూడలేదని కాంగ్రెస్‌ నేత, మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబీ సింగ్‌ విమర్శించారు. గత 50 రోజులుగా ఒక్క మాట కూడా మాట్లాడని ప్రధాని మోడీ నేతృత్వంలో మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు. కేంద్ర సాయుధ బలగాలను వెంటనే వెనక్కి పంపాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో, సంక్షోభాన్ని నిలువరించడంలో సిఎం ఘోరంగా విఫలమయ్యారని, ఆ విషయాన్ని స్వయంగా రెండుసార్లు బీరేన్‌సింగ్‌ బహిరంగంగా అంగీకరించారని, ప్రజలను క్షమించాలని కూడా కోరారని చెప్పారు. కుకీ ప్రయోజనాలను సమర్థిస్తున్నామని చెప్పుకునే కొన్ని మిలిటెంట్‌ గ్రూపులతో త్రైపాక్షిక ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 11న ఏకపక్షంగా ఉపసంహరించుకుందని తెలిపారు. ఈ చర్యను తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించిందన్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం మిగతా 5లో జరిగిందని పేర్కొన్నారు. మణిపూర్‌ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతపై ఏ విధంగానూ రాజీపడవద్దని స్పష్టం చేశారు. ప్రతి సంఘం ఫిర్యాదులను తప్పనిసరిగా వినాలని, సున్నితంగా పరిష్కరించాలని సూచించారు. రెండు జాతీయ రహదారులను ఎల్లప్పుడూ తెరిచి, సురక్షితంగా ఉంచాలని, ప్రజలకు అవసరమైన వస్తువులు లభ్యమయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత ప్రజలకు ఉపశమనం, పునరావాసం, జీవనోపాధికి సంబంధించిన ప్యాకేజీని తక్షణం సిద్ధం చేయాలని, ఇప్పటికే ప్రకటించిన ఉపశమన ప్యాకేజీ సరిపోదని అన్నారు.
 

                                                 బీరెన్‌ సింగ్‌కు అధికారంలో కొనసాగే హక్కు లేదు : సిపిఎం

పక్షపాతం, నిష్క్రియాత్మకమైన బిజెపి ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌కు అధికారంలో కొనసాగే హక్కు లేదని సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. సమస్యలకు బీరెన్‌ సింగ్‌ మూలకారణమని, ఆయన సిఎంగా కొనసాగితే పరిష్కారం అసాధ్యమని అన్నారు. బిజెపి మిత్రపక్షమైన ఎంఎన్‌ఎఫ్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ, జెడియు, ఆప్‌, ఆర్‌జెడి కూడా సిఎంను తొలగించాలన్న సిపిఎం డిమాండ్‌కు మద్దతు పలికాయి. పోలీసుల ఆయుధాలను మిలిటెంట్లు స్వాధీనం చేసుకోవడంపై కేంద్రం మౌనం వహించడాన్ని బ్రిట్టాస్‌ ప్రశ్నించారు. ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలుసహా ముగ్గురితో కూడిన ప్రతినిధి బృందం ఢిల్లీ చేరుకుని ప్రధానిని కలిసేందుకు సమయం అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలని బిజెపి ఎమ్మెల్యేలు స్వయంగా డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. మేఘాలయ, సిక్కిం ముఖ్యమంత్రులను సమావేశానికి ఆహ్వానించి, మణిపూర్‌ ముఖ్యమంత్రిని ఆహ్వానించకపోవడంపై బ్రిట్టాస్‌ ప్రశ్నించారు.
 

                                                       అఖిలపక్షాన్ని మణిపూర్‌ పంపండి : ఆర్‌జెడి, టిఎంసి

వారం రోజుల్లో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మణిపూర్‌ పంపించాలని టిఎంసి, ఆర్‌జెడి డిమాండ్‌ చేశాయి. శాంతి, సామరస్యాన్ని పునరుద్ధరించాలని కోరాయి. మణిపూర్‌ సిఎంపై విశ్వాసం లేదని, ఆయన శాంతిని పునరుద్ధరించలేరని చెప్పినట్లు ఆర్‌జెడి నేత మనోజ్‌ కుమార్‌ ఝా అన్నారు.
            శివసేన (ఉద్దవ్‌ థాకరే) ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ మణిపూర్‌ పరిస్థితిపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, సాధారణ స్థితికి తీసుకురావడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.
           డిఎంకె నేత తిరుచ్చి శివ మాట్లాడుతూ ''శాంతిని పునరుద్ధరిస్తామని, తనను నమ్మాలని హోం మంత్రి అన్నారు. ప్రధాని స్పందించకపోవడంపై నిలదీశాం. అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మణిపూర్‌ పంపాల్సిందిగా కోరాం. పాలనా వైఫల్యం, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే అక్కడ హింస చెలరేగింది'' అని అన్నారు.
          బిఆర్‌ఎస్‌ నేత బోయినపల్లి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ మణిపూర్‌ ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించే బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపై ఉందని అఖిలపక్ష సమావేశంలో చెప్పామన్నారు. బాధితులకు పునరావాసం కల్పించాలని, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలని కోరామన్నారు. ఇప్పటివరకు ప్రధాని స్పందించకపోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు అన్ని పార్టీలను తీసుకెళ్లాలని కోరారు.
           ఈ సమావేశానికి జెపి నడ్డా (బిజెపి), మేఘాలయ సిఎం కాన్రాడ్‌ సంగ్మా (ఎన్‌పిపి), సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ (సిక్కిం క్రాంతికారి మోర్చా), , బీరేంద్ర ప్రసాద్‌ బైశ్యా (అసోం గణ పరిషత్‌), డెరెక్‌ ఒబ్రెయిన్‌ (టిఎంసి), రామ్‌ గోపాల్‌ యాదవ్‌ (ఎస్‌పి), బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (వైసిపి), వినోద్‌ కుమార్‌ (బిఆర్‌ఎస్‌), సంజయ్ సింగ్‌ (ఆప్‌), పినాకి మిశ్రా (బిజెడి), తంబిదురై (అన్నాడిఎంకె), నరేంద్ర వర్మ (ఎన్‌సిపి), అనిల్‌ ప్రసాద్‌ (జెడియు), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర హోం సహాయ మంత్రులు నిత్యానంద్‌ రారు, అజరు కుమార్‌ మిశ్రా, కార్యదర్శి అజరు భల్లా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ తపన్‌ దేకా తదితరులు హాజరయ్యారు.
          అఖిలపక్ష సమావేశానికి సిపిఐని ఆహ్వానించకపోవడంపై కేంద్ర హోం మంత్రి వివరణ ఇవ్వాలని ఆ పార్టీ ఎంపి బినరు విశ్వం డిమాండ్‌ చేశారు. అఖిలపక్షం నేపథ్యంలో ఆయన ఈమేరకు స్పందించారు.