May 14,2023 10:35

న్యూఢిల్లీ : ప్రభావవంతమైన ప్రాంతీయ నేతలు ప్రజల మౌలిక సమస్యలను తెరపైకి తీసుకురాగలిగినట్లైతే మోడీ అయినా ఓడిపోక తప్పదని కర్ణాటకలో బిజెపి ఓటమి రుజువు చేసింది. కాంగ్రెస్‌ 136 స్థానాలు గెలుచుకుని తిరుగులేని విజయాన్ని సాధించింది. కేవలం 65స్థానాలకే బిజెపి పరిమితమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఉదయమే ఓటమిని అంగీకరించారు. ''స్వయంగా ప్రధాని మోడీ, బిజెపి కార్యకర్తలు తీవ్రంగా కృషి చేసినా, మేం కనీసం సగం సీట్లను కూడా సాధించలేకపోయాం. ఈ ఫలితాలపై కచ్చితంగా సవివరమైన విశ్లేషణ చేయాలి.'' అని బొమ్మై వ్యాఖ్యానించారు.
 

                                                                  పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత

కర్ణాటకలో బిజెపి నుండి కాంగ్రెస్‌ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చాలా మంది భావించారు. అయితే, ఇక్కడ దీని జాతీయ పర్యవసానాలు మరింత కీలకం కానున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కొరకు జరిగే ఎన్నికల ప్రచారాన్ని కర్ణాటక ఫలితాలు ప్రభావితం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అవిశ్రాంతంగా ప్రచారం చేసినప్పటికీ, ముంచుకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను బొమ్మై, బిజెపిలు అధిగమించలేకపోయాయి. పలుమార్లు రోడ్‌ షోలు నిర్వహించడం ద్వారా మోడీ పార్టీకి ఎక్కువ ఓట్లు తీసుకువస్తారని బిజెపి గట్టిగా నమ్మింది. కానీ అందుకు విరుద్ధంగా ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. హనుమాన్‌ను బజరంగ్‌దళ్‌తో కలగా పులగం చేసి 'జై భజరంగ్‌ భళీ' అంటూ ఓట్లు దండుకోవడానికి చేసిన వికృత చేష్టలు రోత పుట్టించాయి. మతపరమైన నినాదాలను రాజకీయాలతో మేళవించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నించారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో 'జై బజరంగ్‌భళి' అని నినదించాలంటూ మోడీ ఓటర్లను కోరడం దీనిలో భాగమే. వాస్తవానికి కర్ణాటకలో బిజెపికి ఇప్పటికీ తగినంత ఓటింగ్‌ శాతం వుంది. కానీ నిర్ణయాత్మకమైన ప్రజా తీర్పును కాంగ్రెస్‌ గెలుచుకుంది.
 

                                                            మతపరమైన నినాదాలతో ఫలితం లేదు

బిజెపికి ఓట్లు రాబట్టడానికి మోడీ లేవనెత్తిన మతపరమైన నినాదం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, 1951నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించింది. రాజకీయ నేతలు, పార్టీలు మతం పేరుతో ఓట్లు అడగడాన్ని ఆ చట్టం నిషేధిస్తున్నది. మోడీ మతపరమైన నినాదాలు లేవనెత్తడానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై భారత ఎన్నికల కమిషన్‌ నిష్క్రియాపరత్వంతో, చెవిటివాని ముందు శంఖం ఊదిన తరహాలో వ్యవహరించడం చాలా ఆందోళన కలిగిస్తోంది.
            మోడీ పదే పదే 'జై బజరంగ్‌ భళి' నినాదాన్ని ఉచ్ఛరిస్తున్నారంటే మతాన్ని, రాజకీయాలతో ముడి పెట్టినట్లే. ఇది, చట్టం, లౌకికవాదానికి పూర్తి విరుద్ధమైన, దారుణమైన చర్య. బ్రిటీష్‌ వారు ''భారత రాజకీయాల్లోకి మతాన్ని ప్రవేశపెట్టారు'' అంటూ 1946 డిసెంబరు 17న రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీలో మాట్లాడిన జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ దార్శనికతను కూడా ఇది తిరస్కరిస్తోంది.
         'బొమ్మై ప్రభుత్వానికి మరో అవకాశాన్ని ఇవ్వరాదు'' అని 67శాతం మంది ఓటర్లు అభిప్రాయపడినట్లు ఎడినా పోల్‌ సర్వే వెల్లడించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఇది బలంగా ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రిని కూడా పక్కకు నెట్టేసేలా, బి.ఎస్‌.యడ్యూరప్ప వంటి ప్రధాన నేతలకు కూడా తగిన ప్రాముఖ్యత ఇవ్వకుండా మోడీ ప్రధానంగా సాగిన ప్రచారం విఫలమైందని రుజువు చేసింది.
         బిజెపి ఓటమి వెనుక గల అత్యంత ప్రధానమైన కారణాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పవనాలు ఒకటవడంలో ఎలాంటి సందేహం లేదని ఈ ఎన్నికల తీర్పు రుజువు చేసింది. దీనికి తోడు కాంట్రాక్టర్ల నుండి 40శాతం ముడుపులు తీసుకున్న ప్రభావం బొమ్మై ప్రభుత్వాన్ని చాలా బలంగా దెబ్బ కొట్టింది. ఈ కారణాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఇవన్నీ కలిసి ప్రభుత్వ సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి.
 

                                                           కింది స్థాయిలోని ఓటర్లతో కాంగ్రెస్‌ సంబంధాలు

అట్టహాసంగా రోడ్‌ షోలతో మోడీ ఒకపక్క ఉధృతంగా ప్రచారం సాగిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్‌ నేతలు ముఖ్యంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి నేతలు అట్టడుగు స్థాయిలోని ఓటర్లను కలిశారు, వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ప్రాంతీయ సమస్యలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అనుసరించిన కీలకమైన వ్యూహాల్లో ఇదొకటిగా వుంది.
డెలివరీ బారు స్కూటర్‌ వెనకాల ఎక్కి రాహుల్‌ గాంధీ దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తీరు ఆయన ప్రజలతో మమేకమైన తీరును స్పష్టం చేసింది. వీటికి తోడు బిజెపి ప్రభుత్వ వైఫల్యం, ధరల పెరుగుదల, అవినీతి, పాలన పూర్తిగా కుప్పకూలడం వంటి అంశాలు కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి.
 

                                                   కాంగ్రెస్‌, నెహ్రూ దార్శనికతకు మహిళల మద్దతు

కాంగ్రెస్‌ ఎదుగుదల వెనుక మహిళల మద్దతు చాలా కీలక పాత్ర పోషించింది. బిజెపి కన్నా కాంగ్రెస్‌కే ప్రాధాన్యతనివ్వాలని 40శాతం మంది మహిళా ఓటర్లు భావించినట్లు ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ వెల్లడించింది. మహిళల మద్దతును పొందడంలో బిజెపికి ఆరు పాయింట్లు వస్తే కాంగ్రెస్‌కు 11పాయింట్లు వచ్చాయని ఆ ఎగ్జిట్‌ పోల్‌ తెలిపింది.
       ఎన్నికలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే వ్యక్తి, స్వరాజ్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్‌ విశ్లేషణ ప్రకారం, కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డ్‌లో ప్రజలకు చేసిన పలు వాగ్దానాల్లో - మహిళలు కుటుంబ పెద్దగా వున్న కుటుంబాలకు నెలవారీ రూ.2 వేలు, అన్న భాగ్య యోజన కింద ప్రతి కుటుంబ సభ్యుడికి 10కిలోల బియ్యం వంటివి మహిళల మద్దతు కాంగ్రెస్‌ చూరగొనడంలో కీలకంగా మారాయి. వీటికి తోడు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ కూడా ఆ పార్టీకి అదనంగా ఓట్లను సమీకరించి పెట్టింది.
        అనేక ఏళ్లుగా, దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సర్వసాధారణంగా మారింది. భారత రాజకీయాల డైనమిక్స్‌ను, కర్ణాటకలో కాంగ్రెస్‌ ఆవిర్భావాన్ని అర్థం చేసుకోవాలంటే విస్మరించబడుతున్న ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిర్ణయాత్మకంగా వున్న జెండర్‌ అంశాన్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం వుంది.
         1952 సార్వత్రిక ఎన్నికల తర్వాత, అదే ఏడాది మే 18న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాస్తూ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, లోక్‌సభ, రాజ్యసభలకు కేవలం అతి కొద్దిమంది మహిళలు మాత్రమే ఎన్నికయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ''ప్రజా జీవితంలో మహిళలు వారి వంతు పాత్రను పోషించడానికి పూర్తి అవకాశం వచ్చినపుడే మనకు వాస్తవికమైన, మౌలికమైన పురోగతి సాధించాలని నేను కచ్చితంగా చెప్పగలను.'' అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ''ఎక్కడ వారికి ఈ అవకాశం వచ్చినా, వారు సగటు పురుషుని కన్నా బాగా వ్యవహరించగలరని నేను చెప్పదలిచాను.'' అని ఆయన పేర్కొన్నారు.
          ''పురుషుల కన్నా మహిళలపైనే బహుశా భారతదేశ భవితవ్యం ఎక్కువగా ఆధారపడివుంది.'' అని నెహ్రూ ఉద్ఘాటించారు. 1953 సెప్టెంబరు 20న ముఖ్యమంత్రులకు రాసిన మరో లేఖలో కూడా ఆయన ఇదే వైఖరి పునరుద్ఘాటించారు. ''భారతీయ స్త్రీత్వం ప్రమాణాలు చాలా ఉన్నతంగా వుంటాయి. భారతీయ మహిళలు, పురుషుల కన్నా ఎక్కువగా అంతర్జాతీయ స్థాయిలో మనకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఏ దేశమైనా మహిళలకు పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వకపోతే ముందుకు వెళ్లలేదు.'' అని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటక సర్వేలో కాంగ్రెస్‌కు చాలా పాయింట్లు వచ్చాయి, అనేక అంశాల్లో మహిళలకు వారి రోజువారీ జీవితాలను ప్రభావితం చేయగల హామీలు ఇచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్‌ విజయం సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. సామాన్యులతో ముఖ్యంగా మహిళలతో మాటామంతి కలపడానికి ,వారి సాధక బాధకాలు తెలుసుకోవడానికి కనివినీ ఎరుగని రీతిలో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు కూడా క్రెడిట్‌ ఇవ్వాలి. కర్ణాటకలో ఈ యాత్ర సాగిన సమయంలో వారి సమస్యలను రాహుల్‌ లేవనెత్తారు.
 

                                                               కుప్పకూలిన హిందూత్వ వ్యూహం

హిజాబ్‌, హలాల్‌ మాంసం, అజాన్‌, కర్ణాటక పశు వధ నివారణ చట్టం, 2020, రాష్ట్ర జనాభాలో 12 నుండి 14శాతంగా వున్న ముస్లింలను సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించాలన్న పిలుపు వీటి చుట్టూ తిరిగిన బిజెపి హిందూత్వ వ్యూహం కర్ణాటకలో పూర్తిగా కుప్పకూలిపోయింది. పార్టీ ఓటమికి ఇదొక ముఖ్యమైన కారణంగా వుంది.
       బజరంగ్‌ దళ్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధిస్తామని కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన తర్వాత, 'జై బజరంగ్‌ భళీ' అని నినాదాన్ని మోడీ ఇవ్వడం పార్టీకి అనుకూలంగా పరిస్థితి మారుతుందనే ఆశ కల్పించింది.
         ప్రభావవంతులైన ప్రాంతీయ నేతలు ప్రజల మౌలిక సమస్యలపై గళమెత్తితే మోడీ అయినా ఓడిపోక తప్పదని బిజెపి ఓటమి రుజువు చేసింది. హిందూత్వ మరియు సంకుచిత జాతీయవాదం పేరుతో మోసగించడం, దీనికి తోడు దూకుడుతో కూడిన మెజారిటీవాదాన్ని అనుసరించడం కూడా ఓటమికి కారణాలయ్యాయి.
 

                                                                       మెజారిటీవాదం ఓటమి

కర్ణాటకలో బిజెపికి 35శాతం ఓటు వున్నా, మెజారిటీవాదం ఓడిపోయింది. మెజారిటీ వాదాన్ని ఓడించడంలో కర్ణాటక మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఈ ఫలితాలు యావద్దేశంలో చారిత్రక ప్రాముఖ్యత కలిగివున్నాయి. భారతదేశపు ఈ ఆలోచనను పరిరక్షించుకోవడం, దానిని కాపాడుకోవడంపైనే దీని ప్రాముఖ్యత దాగివుంది.
            (రచయిత ఎస్‌.ఎన్‌.సాహు మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ వద్ద ఒఎస్‌డి -ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ - గా పనిచేశారు. )