-10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో:తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఎఆర్‌ఒల వివరాలు, ఇతర నిబంధనలతో రిటర్నింగ్ అధికారులు ఫారం-1 విడుదల చేశారు. దీంతో, శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు (సెలవు దినాలు మినహా) నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 13న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఉంది. నవంబర్ 30న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్. మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, ఆశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం ఏడు గంటల ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి నేరాల చిట్టాను స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) పేర్కొంది. ఆ నేరాల వివరాలను మూడు దఫాలు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని నిర్దేశించింది. ఒకవేళ అభ్యర్థి జైలులో ఉన్న పక్షంలో అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాన పార్టీల్లో టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. బిఆర్‌ఎస్ 117 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ వంద, బిజెపి 88, సిపిఎం 17, ఎంఐఎం ఏడు, బిఎస్‌పి 59 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.










