Sep 12,2022 21:07

ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) : తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అధికారులు సోమవారం గ్రామ సభలు నిర్వహించారు. మొదటి రోజు రాజధాని గ్రామాలు లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, హరిశ్చంద్రపురంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఒక్కరు మినహా ఏకగ్రీవంగా అమరావతి మున్సిపాల్టీని వ్యతిరేకించారు. ముందుగా లింగాయపాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో 79 మంది పాల్గన్నారు. గ్రామ రైతు మాదల వెంగళరెడ్డి మినహా మిగిలిన 78 మంది మున్సిపాల్టీకి వ్యతిరేకంగా చేతుతెత్తారు. ఉద్దండరాయునిపాలెంలో పాల్గన్న వందమంది, హరిశ్చంద్రపురంలో పాల్గన్న 70 మంది మున్సిపాల్టీని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, అప్పుడు మా శవాల మీద మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకోండని లింగాయపాలెం గ్రామసభలో అధికారుల ముందు ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.