- నూతన పార్లమంట్ భవననానికి అంబేద్కర్ పేరు పెట్టాలి
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : దేశంలో రైతులు, పేద ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే విద్యుత్ సవరణ బిల్లు 2022ను తక్షణమే ఉప సంహరించుకోవాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రాల హక్కులు హరించేలా రూపకల్పన చేసిన విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యుత్ సవరణ బిల్లు చట్టమైతే రాష్ట్రంలో 90 లక్షల వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి అన్నారు. విద్యుత్ రంగంలో ప్రైవేటు కంపెనీల ఆధిపత్యానికి దారితీసేలా ఈ బిల్లు ఉందని చెప్పారు. విద్యుత్ సంస్థ ఆస్తులను ప్రవేటుపరం చేసేలా ఉన్న విద్యుత్ సవరణ బిల్లు 2022ను కేంద్రం ఉపసంహరించుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించాలని కోరారు. సభ ఆమోదం మేరకు తీర్మానాన్ని స్వీకరిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కెటిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపైనా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. అంబేద్కర్ చూపిన బాటలోనే తాము నడుస్తున్నట్లు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయిన పార్లమెంట్‌కు పేరు పెట్టడానికి అంబేద్కర్ మించిన వ్యక్తి లేరని అన్నారు. తీర్మానాన్ని కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు బలపర్చగా బిజెపి సభ్యులు స్పందించలేదు.










