Nov 09,2023 08:50
  • కార్మిక కుటుంబాలతో కలిసి మహాదీక్ష
  • వెయ్యి రోజులకు చేరుకున్న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ దీక్షలు
  • ప్రయివేటీకరణపై తాడోపేడో తేల్చుకుంటాం : పోరాట కమిటీ నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖలో 'ఉక్కు' నినాదం హోరెత్తింది. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటం వెయ్యి రోజులకు చేరుకున్న సందర్భంగా కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద దీక్షా శిబిరానికి కార్మికులు తమ కుటుంబాలతో సహా కలిసి వచ్చి మహాదీక్ష చేపట్టారు. సిపిఎం, సిపిఐ, వైసిపి, టిడిపి, జనసేన, ఆప్‌, ప్రజాశాంతి పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. 'స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తే తాడోపేడో తేల్చుకుంటాం' అన్న పోరాట కమిటీ నేతలతో రాజకీయ పార్టీల నేతలూ గొంతుకలిపారు.
           మహాదీక్షా శిబిరానుద్దేశించి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. నిరంతరాయంగా పోరాటం కొనసాగించడం వల్లే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ స్టాటజిక్‌ సేల్‌ చేయకుండా ఆపగలిగామని అన్నారు. పలు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 49 శాతం వాటాలు అమ్మినప్పటికీ, కార్మికుల పోరాట ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఒక శాతం కూడా ప్రయివేటుపరం కాలేదన్నారు. విద్యార్థి సంఘాల నుంచి ఉక్కు పోరాటానికి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మూడుసార్లు బంద్‌లు, రాస్తారోకోలు చేపట్టారని తెలిపారు. ఈ పోరాటానికి బిజెపి మినహా అన్ని ట్రేడ్‌ యూనియన్లు, రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారని తెలిపారు. పది వేల మందితో విశాఖ బీచ్‌ రోడ్డులో కిసాన్‌ సంయుక్త మోర్చా నాయకులతో కలిసి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పది కిలోమీటర్ల మానవహారం, ఐదు కిలోమీటర్ల నడక వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఉక్కును రక్షించుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ రాజకీయ నాయకులు పార్లమెంటులో గొంతు విప్పాలని డిమాండ్‌ చేశారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుపై జరుగుతున్న కుట్రలను వివరించారు. వైసిపి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. త్యాగాల ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం కానిచ్చేది లేదన్నారు. టిడిపి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. ప్రయివేటీకరణ చర్యలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్‌ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు.. ప్రజల సంపదని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ విసి బాలమోహన్‌దాస్‌, 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్‌ బి.గంగారావు, పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌, కెఎస్‌ఎన్‌.రావు మాట్లాడారు.
 

                                                                            స్వల్ప ఉద్రిక్తత

మహా దీక్ష జరుగుతుండగానే కొందరు ఉక్కు కార్మికులు, పలు పార్టీల నాయకులు కూర్మన్నపాలెం కూడలిలోని రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి వారిని పక్కకు లాగే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యంలో నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద వున్న గురజాడ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడారు.