వేడెక్కుతున్న 'ఉక్కు ' సెగ : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా .. నేడు రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలు
- బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల మద్దతు
- స్తంభించనున్న రవాణా వ్యవస్థ
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : 'ఉక్కు మాదే.. దానిపై హక్కూ మాదే.. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపకపోతే సహించేది లేదు' అంటూ కేంద్రంలోని బిజెపిపై సమరశీల పోరాటానికి రాష్ట్రంలోని బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి హైవేలను దిగ్బంధించనున్నాయి. ఇప్పటికే పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకూ రవాణా వ్యవస్థ స్తంభించనుంది. ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో అన్ని తరగతుల ప్రజానీకం భాగస్వామ్యం కానున్నారు. ఈ పోరాటంతో రాజకీయంగా రాష్ట్రం మరింత వేడెక్కనుంది. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 810 రోజులుగా అన్ని తరగతులనూ కార్మిక వర్గం ఐక్యం చేసి పోరాటాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. విశాఖలోని కూర్మన్నపాలెం, స్టీల్‌ప్లాంట్, వడ్లపూడి, శ్రీనగర్, అక్కిరెడ్డిపాలెం, గంగవరం, గంట్యాడ, గాజువాక జంక్షన్‌ల వద్ద భారీ రాస్తారోకోలకు కార్మికులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు తామూ మద్దతుగా పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా లారీ ఓనర్ల సంఘం కూడా స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటానికి బాసటగా నిలుస్తోంది. లక్షలాది లారీలు ఇటు విజయవాడ నుంచి శ్రీకాకుళం, అటు నెల్లూరు వరకూ నిలిచిపోనున్నాయి. స్టీల్‌ప్లాంట్ లేకపోతే లారీల రవాణాపై ఆధారపడే లక్షల కుటుంబాల జీవనం దుర్భరమవుతుందని, ప్లాంట్ రక్షణ తమ నినాదం అంటూ లారీ యజమానులంతా హైవేల దిగ్బంధనానికి సై అంటున్నారు. మరోవైపు బుధవారం ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా...నిరసనకు సిద్ధమవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది.
పెరిగిన నిఘా..
ఉక్కు ఉద్యమం నేపథ్యంలో పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలు, అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం, విశాఖపట్నంలోని మధురవాడ ఐటి హిల్స్ వద్దకు సిఎం రానుండడంతో ఇప్పటికే విశాఖలో పోలీసు ఆంక్షలు పెరిగాయి. 1300 మంది పోలీసులతో విశాఖలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
రాస్తారోకోలను జయప్రదం చేయండి : మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
రాష్ట్రంలో 32 మంది బలిదానంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న రాస్తారోకోలు, ఆందోళనలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం తగదన్నారు. లక్షలాది మందికి ఉపాధిని చూపే స్టీల్ ప్లాంటును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.










