- తెలంగాణ వైఖరితో ఆత్మరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం
- స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన సింగరేణి అధికారుల బృందం
ప్రజాశక్తి- యంత్రాంగం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమం రాజుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో మన రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను, రెండు తెలుగు రాష్ట్రాల పెద్దల ప్రకటనలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బిడ్డింగ్‌కు పెడితే, తెలంగాణ ప్రభుత్వం ఆ బిడ్డింగ్‌లో పాల్గొని స్వాధీనం చేసుకుంటుందంటూ బిఆర్‌ఎస్ నాయకులు, తెలంగాణ మంత్రి కెటిఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందకు తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కాలరీస్ డైరెక్టర్ల బృందం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు మంగళవారం విచ్చేసింది. ఈ బృందంలో సింగరేణి కాలరీస్ డైరెక్టర్ సత్యనారాయణరావు, సుబ్బారావు, బలరామ్, ఇద్దరు జనరల్ మేనేజర్లు ఉన్నారు. స్టీల్ సిఎండి లేకపోవడంతో విశాఖ ఉక్కు పరిపాలనా భవనంలో మార్కెటింగ్ ఉన్నతాధికారులను కలిసి చర్చించారు. అనంతరం స్టీల్ డైరెక్టర్లు వేణుగోపాలరావు, భగీచి, మహంతిలతో చర్చలు జరిపారు. ఈ బృందానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, వై.మస్తానప్ప, సిహెచ్.సన్యాసిరావు, వరసాల శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు. ప్రజల సంపద ప్రజలకే చెందే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు.
జగన్ సర్కారుకు చెంపపెట్టు : సిఐటియు
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటుపరం కాకుండా బిడ్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని, జగన్ ప్రభుత్వానికి ఇదో చెంపపెట్టని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్.నర్సింగరావు అన్నారు. జగదాంబ సెంటర్‌లోని సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏ భారీ పరిశ్రమనైనా కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తానంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆ పరిశ్రమను కొనాలని, సింగరేణిని బిజెపి ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తానంటే తెలంగాణ సర్కారు ముందుకు రావడంతో కేంద్రం తోకముడిచిందని గుర్తు చేశారు. ఇలాంటి ప్రకటన వైసిపి ప్రభుత్వం చేయకపోవడం వెనుక ఎపిలో కేంద్ర ప్రభుత్వ కుట్రల్లో జగన్ సర్కారు భాగస్వామ్యముందా? అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్రంతో పోరాడలేకపోతే బోనులో మొదట ముద్దాయిగా జగన్ నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ను అమ్ముతామంటూ రెండున్నరేళ్లుగా కేంద్రం పదేపదే చెబుతుంటే, 22 మంది ఎంపిలున్న వైసిపి ఏం చేస్తోందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ఇప్పటికైనా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలన్న దృష్టి ఉంటే తక్షణమే రూ.1000 కోట్లు మూలధనం, ముడిసరుకు కేటాయించాలని, ప్లాంట్ పరిరక్షణకు కృషి చేయాలని, సొంత గనుల కేటాయింపునకు, ముడిసరుకు వచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
ప్రయివేటీకరణ వద్దని కేంద్రాన్ని కోరాం : సజ్జల రామకృష్ణారెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై తమ పార్టీ విధానం, ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పూలేదని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇఒఐ బిడ్ వేయాలని నిర్ణయం తీసుకుంటే అది వైసిపి ప్రభుత్వ వైఫల్యంగా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై అందరి కంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి స్పందించారని, స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేంద్రాన్ని కోరారని తెలిపారు. సంస్కరణల పేరుతో చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రభుత్వ సంస్థలను మూసివేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారు. విజయవాడలో మీడియాతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రయివేటీకరణకు బిఆర్‌ఎస్ వ్యతిరేకమైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు. కేంద్రం నడపలేని స్టీల్ ప్లాంట్‌ని ఓ రాష్ట్రం నిర్వహించగలదా? అని ప్రశ్నించారు.
అదానీ కోసమే 'విశాఖ స్టీల్'ను అమ్మకానికి పెట్టారు
లాభాలు మోడీ దోస్తులకు... నష్టాలు జాతికి అంకితం : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రధాని మోడీ తన మిత్రుడైన అదానీకి దేశ సంపదను అప్పనంగా దోచి పెడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. అదానీ కోసమే తెలంగాణలోని బయ్యారాన్ని ఎండబెడుతున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ పొట్టగొడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్రం చర్యలు తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం కలిగిస్తాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిలా గనుల నుంచి ముడి ఇనుమును సరఫరా చేయడం ద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయవచ్చని, విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ పని చేస్తే బైలడిలాలో సమీకృత ముడి ఇనుప ఖనిజ పరిశ్రమ (ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ కంపెనీ)ను నెలకొల్పిన అదానీకి నష్టం వాటిల్లుతుందనే ప్రధాని మోడీ దీనిగురించి మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ రకంగా లాభాలను తన దోస్తులకు దోచి పెడుతున్న మోడీ.. నష్టాలను మాత్రం ప్రజలపై మోపుతున్నారని దుయ్యబట్టారు.
సిఎం బాధ్యతగా వ్యవహరించాలి
25 నెలలుగా ఉద్యమం నడుస్తోంది. రాష్ట్రంలో బిజెపి మినహా అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి ఉత్తరాలు రాసినా కేంద్రం పట్టించుకోలేదు. స్టీల్ యాజమాన్యం కూడా పట్టించుకోకుండా ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్లను నియమించింది. మూడు లక్షల కోట్ల స్టీల్‌ప్లాంట్ ఆస్తులను ప్రయివేటు ఆస్తులుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లక్షలాది మంది ప్రజల జీవనాధారమైన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించాలి. ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని కేంద్రంపై పోరాడాలి.
-జె.అయోధ్యరాం,
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్










