- ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు తొలిసారి
సిడ్నీ : ఫిఫా మహిళల ప్రపంచ కప్‌లో స్పెయిన్ జట్టు నయా చరిత్రను నెలకొల్పింది. ఈడెన్ పార్క్‌లో ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో స్పెయిన్ జట్టు 2-1గోల్స్ తేడాతో స్వీడన్‌ను చిత్తుచేసింది. సల్మా పారల్లులో 81 నిమిషంలో గోల్ చేయడంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత స్వీడన్ ప్లేయర్ రెబెక్కా బ్లొంక్విస్ట్ 89వ నిమిషంలో గోల్ కొట్టి స్కోర్ సమం చేసింది. కొద్ది నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందని స్పెయిన్‌కు చెందిన ఒల్గా కార్మోనా గోల్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మ్యాచ్ ప్రారంభమైన 80 నిమిషాలవరకు ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. ఈ టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న స్పెయిన్ మహిళల జట్టు తొలిసారి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో అడుగు పెట్టింది. చివర్లో ఒల్గా కార్మోనా విన్నింగ్ గోల్ కొట్టడంతో స్పెయిన్ డగౌట్‌లో సంబరాల్లో మునిగిపోగా.. స్వీడన్ ప్లేయర్స్ కన్నీటి పర్యంతమయ్యారు. నేడు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లమధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.











