సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్-ఇ టాపర్ నెదర్లాండ్స్ జట్టు గ్రూప్-సిలో 2వ స్థానంలో నిలిచిన స్పెయిన్‌తో తలపడనుంది. నెదర్లాండ్స్ జట్టు గ్రూప్ లీగ్ పోటీల్లో 9గోల్స్ చేసి కేవలం ఒక్క గోల్‌ను మాత్రమే ప్రత్యర్ధికి సమర్పించుకుంది. ఇక స్పెయిన్ జట్టు 8గోల్స్ కొట్టినా.. 4గోల్స్ ప్రత్యర్ధి జట్లకు సమర్పించుకుంది. ప్రి క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ జట్టు 2-0గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేయగా.. స్పెయిన్ జట్టు ఏకంగా 5-1గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్స్‌ను ఓడించి క్వార్టర్స్‌ఫైనల్‌కు చేరింది. లీగ్ దశలో అంతగా రాణించని స్పెయిన్ జట్టు నాకౌట్ మ్యాచ్‌లో 5గోల్స్‌తో మెరవడం విశేషం. నేడు జరిగే మరో మ్యాచ్‌లో జపాన్ జట్టు స్వీడన్‌తో తలపడనుంది. ప్రి క్వార్టర్స్‌లో స్వీడన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అమెరికాపై పెనాల్టీ షూటౌట్‌లో 5-4గోల్స్‌తో గెలుపొందగా.. జపాన్ జట్టు 3-1గోల్స్ తేడాతో నార్వేను చిత్తుచేసి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు ఫ్రాన్స్‌తో, ఇంగ్లండ్ జట్టు కొలంబియాతో తలపడనున్నాయి.










