Sep 11,2023 21:57

ప్రజాశక్తి-అమరావతి: తిరుపతిలో సాధ్యమైనంత త్వరలో స్కిల్‌ యూనివర్శిటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌, శిక్షణ తదితర అంశాలపై సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు, యువతకు వివిద రంగాల్లో శిక్షణ అందించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు కళాశాలలను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలతో సహా 192 చోట్ల ఐటిఐలు, పాలిటెక్నిక్‌ కళాశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, నాక్‌ కేంద్రాల అనుసంధానంతో స్కిల్‌ హబ్‌లు, 55 ప్రాంతాల్లో స్కిల్‌ స్పోక్స్‌ ఏర్పాటు ద్వారా ఇప్పటికే వివిధ రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జర్మనీ భాషలోనైపుణ్య శిక్షణపొందిన నర్శింగ్‌ విద్యార్ధినులు త్వరలో జర్మనీ దేశానికి వెళ్లనున్నారని సిఎస్‌ తెలిపారు. రాష్ట్రంలోని సెర్ప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టిటిడిసి కేంద్రాల ద్వారా మరిన్ని శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సెర్ప్‌ సిఇఓను సిఎస్‌ ఆదేశించారు. పరిశ్రమలు, చేనేత జౌళిశాఖ, సెర్ప్‌, ఉన్నత విద్యాశాఖ, ఐటి అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మత్స్య విభాగాలుకు మరిన్ని శిక్షణా కార్యక్రమాలకు కార్యాచరణ సిద్థం చేయాలని సిఎస్‌ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ కమిషనరు సురేష్‌కుమార్‌, నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ సిఇఓ వినోద్‌కుమార్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా రాష్ట్రంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఓడరేవులు, విమానాశ్రయాల పనుల పురోగతిపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. వాటికి సంబంధించిన భూసేకరణ, పెండింగ్‌ క్లియరెన్స్‌లపై కూడా సిఎస్‌ సమీక్షించారు.